20 మంది హతం: స్మగ్లర్ల గత దారుణాలు ఇవీ...
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతం కావడం సంచలనం సృష్టిస్తోంది. నిజానికి, చాలా కాలంగా రాయలసీమ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలు మితిమీరిపోతూ వచ్చాయి. ఆంక్షలు, జైల్లు, కేసులు వారికి ఏ మాత్రం అడ్డు రావడంలేదు. ఈ స్థితిలో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్రచందనం అక్రమ రవాణాదారులపై ప్రత్యేకంగా కన్నేసి అదుపు చేసే ప్రయత్నం చేస్తోంది.

గతంలో ఎర్రచందనం స్మగ్లర్లు పలు దారుణాలకు పాల్పడ్డారు. 2013 డిసెంబర్‌లో ఇద్దరు అటవీ శాఖాధికారులు డేవిడ్ కరుణాకర్, శ్రీధర్‌లను ఎర్రచందనం స్మగ్లర్లు అత్యంత దారుణంగా చంపేశారు. మరో ముగ్గురు అటవీ శాఖ సిబ్బంది ఆ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు.
చామల రేంజ్‌లోని భాకరాపేట కనుమలో 2012లో అటవీశాఖ సిబ్బంది చొక్కలింగం, జయరామన్‌లు బంధించి వారిపై దాడి చేశారు. శ్రీకాళహస్తిలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాస్‌ను లారీ ఢీకొట్టి అతన్ని దారుణంగా హత్య చేశారు.

టాస్క్‌ఫోర్స్‌కు చెందిన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మల్లికార్జున్‌ను కూడా అదే రీతిలో హత్య చేశారు. అతను ద్విచక్రవాహనంపై వెళ్తుండగా భారీ వాహనంతో ఢీకొట్టి చంపేశారు.

గతంలో ఓసారి ఎర్రచందనం స్మగ్లర్లను వెంబడిస్తున్న వాహనాన్ని కుప్పంబాదూరు సమీపంలో భారీ వాహనం ఢీకొట్టింది. దాంతో ఆ వాహనం నుజ్జునుజ్జు అయింది. అధికారులు, సిబ్బంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఎస్సై అశోక్ సహా నలుగురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications