రేగా కాంతారావును చల్లబరిచిన రేణుకా చౌదరి
హైదరాబాద్: ఖమ్మం జిల్లా పినపాక నుంచి కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగిన రేగా కాంతారావు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరి జోక్యంతో మెత్తబడ్డారు. ఓ నేత తప్పుదోవ పట్టించడం వల్లనే రేణుకాచౌదరిపై తాను విమర్శలు చేశానని కాంతారావు వివరణ ఇచ్చారు.
కార్యకర్తలతో చర్చించి నామినేషన్ ఉపసంహరణపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. నాయకుల పొరపాటు వల్లే పినపాక సీటును సిపిఐకి ఇవ్వాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఓసారి భద్రాచలం నుంచి మరోసారి వైరా నుంచి పోటీ చేయాలని చెప్పి అయోమయానికి గురి చేశారని కాంతారావు అన్నారు.

కాగా, ఖమ్మం జిల్లా పినపాక సిట్టింగ్ సీటు సిపిఐకి ఇవ్వడం బాధాకరమని, రేగా కాంతారావుకు ఇవ్వాల్సిందని కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఉదయం కేంద్రమంత్రి జైరాంరమేష్, కొప్పుల రాజుతో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
రేగా కాంతారావు వివాదరహితుడని ఆమె అన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రేగ కాంతారవు రేపు(శనివారం) నామినేషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం ఉందని తెలిపారు. మహిళలకు మోడీ రక్షణ కల్పిస్తాడన్న నమ్మకం లేదని రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications