పోసానికి భారీ ఊరట..! సీఐడీ కోర్టు కీలక నిర్ణయం..!
వైసీపీ నేత, టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళిని గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులు వెంటాడుతున్నాయి. ఈ కేసులన్నింటిలోనూ తాజాగా ఒక్కో కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తూ వచ్చింది. దీంతో పోసాని జైలు నుంచి విడుదల కావడం ఖాయమని అనుకుంటున్న తరుణంలో సీఐడీ ఎంట్రీ ఇచ్చింది. పాత కేసు ఒకటి తవ్వి తీసి ఆయన్ను పీటీ వారెంట్ పై అరెస్టు చేసి తీసుకెళ్లిపోయింది. దీంతో పోసాని రిలీజ్ ఆశలు ఆవిరయ్యాయి.
అయితే ఇవాళ గుంటూరు సీఐడీ కోర్టు ఈ కేసులో విచారణ పూర్తి చేసి తీర్పు ప్రకటించింది. పోసానిపై గతంలో సీఐడీ నమోదు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోల మార్ఫింగ్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో పోసాని కృష్ణమురళీకి భారీ ఊరట దక్కినట్లయింది. గతంలో మిగతా కేసుల్లో బెయిల్ పొందిన పోసానికి ఇప్పుడు సీఐడీ కేసులోనూ బెయిల్ లభించడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యేందుకు అడ్డంకులు తొలగిపోయినట్లయింది.

అయితే గతంలోనూ ఇలాగే పోలీసులు నమోదు చేసిన కేసుల్లో బెయిల్ లభించినా సీఐడీ చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చి ఆయన పోసాని ఆశల్ని ఆవిరి చేసిన నేపథ్యం ఉండటంతో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యే వరకూ గ్యారంటీ లేదన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న పోసాని తనకు విముక్తి కల్పించాలని కోర్టును కోరడంతో బెయిల్ ఇచ్చింది. పోసానిపై ఇతర కేసులేవీ నమోదు కాకపోతే ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం ఆయన గుంటూరు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications