టీడీపీ ఎమ్మెల్యే పయ్యావులకు భారీ ఊరట..! జగన్ సర్కార్ కు హైకోర్టు కీలక ఆదేశం..
ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కు భద్రత కల్పించాల్సిందేనని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ఏపీలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్ గా కూడా ఉన్న ఉరవకొండ నేత పయ్యావుల కేశవ్ కు ఇవాళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. పయ్యావుల దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ ఏఫీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఫ్యాక్షన్ ప్రభావిత ఉరవకొండలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు భద్రతను తగ్గిస్తూ గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వ అభిప్రాయం కూడా తెలుసుకుంది. ఇవాళ మరోసారి ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. అనంతరం హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు భద్రత కల్పించాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఐదు లేదా ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది పేర్లు ఇవ్వాలని పిటీషనర్ కు హైకోర్టు సూచించింది. ఇందులో ఇద్దరిని సెక్యూరిటీగా నియమించేందుకు తగిన ఆదేశాలు ఇస్తామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. గతంలో ఈ పిటిషన్ విచారణకు వచ్చిన సందర్బంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించగా... ప్రభుత్వం ఇవాళ్టి వరకూ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై పిటిషనర్ అభ్యంతరం తెలిపారు.
అలాగే పిటీషనరే పేర్లు ఇవ్వాలని హైకోర్టు సూచించడం పట్ల ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటీషనర్ కు నమ్మకం ఉండాలి కదా అని హైకోర్టు తెలిపింది. తొలుత వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు..విచారణ అనంతరం టూ ప్లస్ టూ సెక్యూరిటీ కల్పించడం పై తగిన ఆదేశాలు ఇస్తామని తెలిపింది.












Click it and Unblock the Notifications