ఎమ్మెల్యే పట్ల ఇలాగేనా: ఏపీ లాయర్‌పై సుప్రీం ఆగ్రహం, రోజాకు ఊరట
న్యూఢిల్లీ/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే, నటి రోజాకు సుప్రీం కోర్టులో మంగళవారం నాడు ఊరట లభించింది. రోజా పిటిషన్‌ను విచారించాలని హైకోర్టుకు.. సుప్రీం కోర్టు సూచించింది. ఇందుకు సంబంధించి హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టులో అసిస్టెంట్ రిజిస్ట్రార్ వ్యవహరించిన తీరు పైన సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ పైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. ఆదేశాలను ఈ మెయిల్‌లో హైకోర్టుకు పంపుతున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. బుధవారం ఉదయం పిటిషన్ పైన విచారణ జరపాలని సూచించింది.
రేపు ఉదయం (బుధవారం) పది గంటలకు విచారించాలని సుప్రీం కోర్టు సూచించింది. జస్టిస్ గోపాల గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు బెంచ్ పైకి కేసు రాకుండా జాప్యం చేశారని రోజా సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేశారు. తనను బడ్జెట్ సెషన్లో పాల్గొనకుండా అడ్డుకున్నారని చెప్పారు. నిబంధనల ప్రకారం సస్పెన్షన్ ఆ విడతకే ఉంటుందని చెప్పారు. రోజా తరఫున లాయర్ ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు.

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది పైన సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ప్రజాప్రతినిధి పట్ల ఇలా వ్యవహరిస్తారా అని ప్రభుత్వం తరఫు లాయర్‌ను ప్రశ్నించింది. ప్రజాప్రతినిధి హక్కు కాలరాసే హక్కు ఎవరిచ్చారని పేర్కొంది. ఇలాంటి పరిస్థితులు మాకు ఆందోళన కలిగిస్తున్నాయంది.
సాంకేతిక కారణాలతో వాదించే ప్రయత్నం చేయవద్దని పేర్కొంది. మీరు చెప్తున్న దాంట్లో పస ఉందా అని ప్రశ్నించింది. ఇలాగే మొండిగా వాదిస్తే విచారణకు స్వీకరిస్తామంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
ఈ కేసులో మెరిట్ ఉందని భావిస్తున్నారా అని అడిగింది. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఓ సమయంలో గత్యంతరం లేక ప్రభుత్వ న్యాయవాదిని సహ న్యాయవాదులు కూర్చోబెట్టారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications