రేవంత్ విచారణ: న్యాయవాదులను నిరాకరించిన ఎసిబి ఆఫీసర్లు
హైదరాబాద్ : ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు రూ. 50 లక్షలు ఇస్తుండగా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు మరో వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. రేవంత్‌పై సెక్షన్ 102 కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
రేవంత్‌ను విచారిస్తున్నామని, త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. స్టేట్‌మెంట్ రికార్డు చేసి మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ లాలాగూడ పుష్పనిలయం ప్లాట్ నెంబర్ 4లో రేవంత్‌ను అధికారులు విచారించిన తర్వాత తమ కార్యాలయానికి తరలించారు.

రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ వద్దకు డబ్బులు తీసుకుని వచ్చిన సంచులను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఫోన్లను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. ఎసిబి అధికారులు సంచుల్లోని డబ్బులను లెక్కించారు. వాటిలో ఎక్కువగా 500 రూపాయల నోట్లు ఎక్కువగా ఉన్నాయి. రేవంత్ రెడ్డిని ఎసిబి కార్యాలయానికి తరలించిన తర్వాత జాయింట్ డైరెక్టర్ ఎకె ఖాన్ వచ్చారు. రేవంత్ రెడ్డిని విచారించారు.
రేవంత్ అరెస్ట్‌పై సమాచారం అందుకున్న ఆయన వ్యక్తిగత న్యాయవాదులు వెంటనే ఏబీసీ కార్యాలయానికి వచ్చారు. లీగల్ కౌన్సిల్‌ను కార్యాలయంలోకి అనుమతించకపోవడం చట్టవిరుద్ధమని రేవంత్ తరఫు న్యాయవాదులు అసహనం వ్యక్తం చేశారు. రేవంత్‌ను కలిసేందుకు అనుమతివ్వాల్సిందిగా పోలీసు అధికారులను కోరగా లోనికి వెళ్లడానికి అనుమతి నిరాకరించారు.
దీంతో ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. తమకు అనుమతి నిరాకరించడాన్ని చట్టం అంగీకరించదని న్యాయవాదులు అన్నారు. అరెస్ట్‌కు ముందు కుటుంబ సభ్యులకు, తమకు తెలియజేయాలని నిబంధన ఉందని గుర్తుచేశారు. ఈ అంశాన్ని కోర్టులే పరిష్కరిస్తాయని అన్నారు.












Click it and Unblock the Notifications