గర్విస్తున్నా: ఎపి రాజధానికి రేవంత్ విరాళం, కెసిఆర్‌పై..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాజధాని నిర్మాణం కోసం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు, యువ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి విరాళం ఇచ్చారు. హైదరాబాదులోని గండిపేటలో మహానాడు రెండో రోజు జరుగుతోంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఎపి రాజధాని నిర్మాణం కోసం 2 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ ఓ విశ్వవిద్యాలయమని, ఈ యూనివర్సిటీలో తాను విద్యార్థిని అయినందుకు గర్విస్తున్నానని చెప్పారు. విద్వేషాలు రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. తెరాస ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తాము పోరాడుతామన్నారు. 2019లో తాము టిడిపిని అధికారంలోకి తెస్తామని చెప్పారు.

టిడిపి ఓ రాజకీయ పార్టీ మాత్రమే కాదని, నందమూరి తారక రామారావు స్థాపించిన ఒక విశ్వవిద్యాలయమన్నారు. ఇందులో సుశిక్షితులైన కార్యకర్తలు తయారవుతారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి అధికారంలోకి రావడానికి కారణం చంద్రబాబు నాయకత్వమేనన్నారు.
కాగా, పార్టీ కార్యకర్తల కోసం ప్రారంభించిన పథకానికి ఆయన రూ.5 లక్షలను విరాళంగా ఇస్తానని మహానాడులో ప్రకటించారు. తెలంగాణలో ప్రతిపక్షం పార్టీగా ఉన్న టిడిపి నిర్మాణాత్మకంగా పని చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications