కవితపై రేవంత్ వ్యాఖ్య దుమారం, కేటీఆర్‌పై ఉల్లంఘన..
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యల పైన తెలంగాణ శాసన సభలో దుమారం చెలరేగింది. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత రెండుచోట్ల సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసుకున్నారని మంగళవారం సభలో అన్నారు. దీని పైన అధికార పార్టీ మండిపడింది. రేవంత్‌కు రాజ్యాంగం తెలియదని విమర్శించారు. కవిత పైన వ్యాఖ్యలు చేసిన రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.
బడ్జెట్ పైన మాట్లాడకుండా తాము మాట్లాడకుంటా చేసేందుకే అధికార పక్షం టీడీపీని అడ్డుకుంటోందని టీడీపీ ఎమ్మెల్యే అరికెల నర్సిరెడ్డి అన్నారు. తెలంగాణ కోసం 1200 మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. వారి కుటుంబాన్ని ఆదుకోనందుకే ప్రభుత్వాన్ని తాము నిలదీస్తున్నామన్నారు. తెలంగాణను అమ్మే ప్రయత్నం చేయవద్దన్నారు. బడ్జెట్ పైన మాట్లాడకుండా అడ్డుకోవద్దన్నారు. రేవంత్ పైన ఆరోపణలు చేయవద్దన్నారు.
టీడీపీకి మాట్లడే హక్కు లేదు.. సోనియా ఇచ్చారు

తెలంగాణ ద్రోహులు అయిన టీడీపీకి మాట్లాడే హక్కులేదని, వారు ఉద్యమంలో ఎక్కడ పాల్గొన్నారని నాయిని నర్సింహా రెడ్డి ప్రశ్నించారు. కొద్దో గొప్పో కాంగ్రెస్ పార్టీ ఉద్యమించిందన్నారు. తెలంగాణ ఇచ్చింది ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీయే అన్నారు. అమరవీరులు ఎంతమంది ఉన్నారో తాము సర్వే చేస్తున్నామని చెప్పారు. తర్వాత అన్యాయం జరిగితే ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు.
అదే సమయంలో పలువురు తెరాస సభ్యులు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పత్రికలో వచ్చిన వాటి పైన కించపర్చేలా ఉందని తెరాస సభను అడ్డుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. నిన్నటి అంశం పైన ఇవాళ చర్చించడం సరికాదన్నారు.
ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడుతూ.. రేవంత్ క్షమాపణ కోరే ముందు ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. దీనిపై హరీష్ రావు మాట్లాడుతూ.. క్షమాపణ చెప్పాకనే రేవంత్ బడ్జెట్ పైన మాట్లాడాలన్నారు.
అధికార పార్టీ సభ్యులు వెల్‌లోకి రావడమా?
అధికార పార్టీ సభ్యులు వెల్లోకి రావడం సరికాదని బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. అధికార పార్టీ వెల్లోకి వస్తే సమాధానం చెప్పవలసి ఉంటుందన్నారు. కవిత పైన చేసిన వ్యాఖ్యలకు రేవంత్ ఆధారాలు చూపిస్తే ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. లేదంటే క్షణాకావేశంలో సభ్యుడు తప్పు చేస్తే పట్టింపులకు పోవద్దన్నారు. సభ్యులు హుందాగా ముందుకు పోవాలన్నారు. అధికార పక్షం సహనంతో ఉండాలని, ప్రతిపక్షాలు సహకరించాలన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా సభ్యుల గురించి మాట్లాడితే ఆధారాలు చూసుకొని మాట్లాడితే బాగుండేదని, దీని పైన అతను క్షమాపణ కోరాలని, ప్రభుత్వం కూడా పట్టుదలకు పోవద్దన్నారు. చిన్న విషయం ఇంత రాద్దాంతం చేయడం సరికాదన్నారు.
కేటీఆర్ పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పైన రేవంత్ రెడ్డి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఇది కూడా వాగ్వాదానికి దారి తీసింది. సభా హక్కుల నోటీసు ఇవ్వాలంటే ముందే చెప్పి ఇవ్వాలని, ఈ రోజు సమయం అయిపోయింది కాబట్టి రేపు ఇవ్వవచ్చునని హరీష్ రావు అన్నారు. తాము స్పీకర్‌కు చెప్పే ఇస్తున్నామని టీడీపీ సభ్యులు చెప్పారు. కాగా, సభ వాగ్వాదాల మధ్య గురువారానికి వాయిదా పడింది. మండలి కూడా రేపటికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications