రెండేసి చోట్ల చంద్రబాబు, పవన్ పోటీ ? టికెట్ రాని వారికి మరో పదవి ! రోజా కామెంట్స్
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీలు టికెట్ల సర్దుబాట్లు, కేటాయింపులపై సీరియస్ గా దృష్టిపెట్టాయి. ఈసారి ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా హోరాహోరీ పోరు తప్పదన్న అంచనాల నేపథ్యంలో చివరి నిమిషాల్లో లెక్కలు మారిపోతున్నాయి. పలు సీట్లలో వైసీపీ ఇన్ ఛార్జ్ లను సీఎం జగన్ మార్చేస్తుండగా.. అందుకు అనుగుణంగా విపక్షాలు కూడా మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ పోటీపై మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాలపై ఆసక్తికర చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ రెండు చోట్ల నుంచి పోటీ చేయడం ఖాయమని ఏపీ మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. ఎందుకంటే పోటీ చేసేందుకు విపక్షాలకు అభ్యర్ధులు లేరన్నారు. కాబట్టి ఇతర పార్టీల నుంచి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

మరోవైపు వైసీపీలో చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల నేపథ్యంలో టికెట్ రాని వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తామని మంత్రి రోజా హామీ ఇచ్చారు. కాబట్టి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇవ్వరాదని జగన్ భావిస్తున్న నేపథ్యంలో వారంతా ప్రత్యామ్నాయాలపై దృష్టిపెడుతున్నారు. వీరిలో కొందరు పార్టీ మారేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో టికెట్లు రాని వారికి ప్రత్యామ్నాయ పదవులు ఇస్తామంటూ రోజా చెబుతున్న మాటలు ఆసక్తిరేపుతున్నాయి.
మరోవైపు ఇవాళ వరుసగా రెండోరోజు సీఎం జగన్ వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా టికెట్లు రాని సిట్టింగ్ లతో చర్చలు జరుపుతున్నారు. ఇవాళ ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణాజిల్లాపైనా జగన్ ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి ఆర్కే రోజాకు కూడా ఈసారి నగరి నుంచి టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. నగరిలో రోజా స్ధానంలో శిల్పా చక్రపాణి రెడ్డికి అవకాశం కల్పించవచ్చని తెలుస్తోంది. దీనిపై స్పందించిన రోజా నగరిలో టికెట్ ఎవరికి ఇచ్చినా పర్వాలేదన్నారు. అయినా నగరి టికెట్ తనకేనని నాయకులు, కార్యకర్తలకు తెలుసన్నారు.












Click it and Unblock the Notifications