రోడ్డు ప్రమాదం: నవ దంపతుల దుర్మరణం
శ్రీకాకుళం: వివాహమై పది రోజులైనా కాకముందే రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతిచెందిన విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సమీపంలో చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రంలోని బరంపురం సమీపంలోని ఇంద్రాణి గ్రామానికి చెందిన బృందావన్ సాహు(26)కు 10 రోజుల క్రితం పర్లాకిమిడి సమీపంలోని గారబంద గ్రామానికి చెందిన గౌతమి(24)తో వివాహం జరిగింది.
సాంప్రదాయం ప్రకారం బృందావన్‌సాహు అత్తవారింట్లో 10 రోజులు ఉండి బుధవారం బరంపురం తిరిగి వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ఇచ్ఛాపురం సమీపంలోని బలరాంపురం చెక్‌గేటు వద్ద ఆగి వున్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గౌతమి అక్కడకక్కడే మృతి చెందింది.
బృందావన్‌సాహు ఇచ్ఛాపురం ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం 108 వాహనంలో బరంపురం తరలిస్తుండగా మార్గమాధ్యంలో మృతి చెందాడు. రోడ్డుప్రమాదం జరిగిన స్థలం ఒడిస్సా పరిధిలోకి వచ్చినందున ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు.

విద్యుదాఘాతంలో వలస కూలీ మృతి
విద్యుదాఘాతానికి గురై 13 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న చెన్నాపురం గ్రామానికి చెందిన బట్టి అసిరయ్య(44) బుధవారం మృతిచెందాడు. మూడు నెలల కిందట నెల్లూరులో భవన నిర్మాణ పనుల కోసం వెళ్లిన అసిరయ్య 13 రోజుల కిందట విద్యుదాఘాతానికి గురై తీవ్రగాయాలపాలయ్యాడు. అప్పటి నుంచి స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. మంగళవారం పరిస్థితి విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లమని సూచించారు.
బుధవారం ఇంటికి తీసుకొస్తుండగా గ్రామ సమీపంలో మృతిచెందాడు. మృతుడుకి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సంక్రాంతికి ఇంటికి వచ్చి పండుగ జరుపుకుందామన్న సమయంలో ప్రమాదం బారిన పడ్డాడని గ్రామ స్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అసిరయ్య అకాల మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.












Click it and Unblock the Notifications