ఎంపీ రాయపాటి సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో చోరీ
అమరావతి: నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో చోరీ జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం విజయవాడలోని భారతీ నగర్ సమీపంలోని శ్రీనగర్ కాలనీలో ఎంపీ రాయపాటి క్యాంపు కార్యాలయం ఉంది.
ఎప్పటిలాగే సిబ్బంది శుక్రవారం రాత్రి ఆఫీసుకు తాళం వేసి ఇంటికి వెళ్లిపోయారు. శనివారం ఉదయం కార్యాలయానికి చేరుకున్న సిబ్బంది ప్రధాన ద్వారం, లోపలి బీరువా తెరచి ఉండటాన్ని గమనించారు. సిబ్బంది కార్యాలయ మేనేజర్ శాస్త్రికి సమాచారం అందించారు.
ఆయన వెంటనే కార్యాలయానికి చేరుకుని పరిశీలించగా ల్యాప్‌టాప్, బీరువాలో ఉండవలసిన రూ.5 లక్షల నగదు కనిపించలేదు. దీంతో ఆయన పటమట పోలీసులకు సమాచారం అందించారు. ఏడీసీపీ రామకోటేశ్వరరావు, ఏఎస్‌ఐ శేషారెడ్డి, క్లూస్‌టీమ్ సంఘటన స్థలానికి చేరుకుని సిబ్బంది వద్ద నుంచి వివరాలు సేకరించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి విచారణ ప్రారంభించారు. క్లూస్‌టీమ్ వేలిముద్రలు సేకరించారు. కార్యాలయంలో సీసీ కెమెరాలు అమర్చి ఉండడంతో పోలీసులు సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగతనాన్ని ఇంటి దొంగల పనిగా భావిస్తున్న పోలీసులు, కార్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కార్యాలయం ఎంపీ రాయపాటి సాంబశివరావుది కాదని, ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిదని సిబ్బంది చెబుతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications