వైైసీపీలో టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడి చేరికకు బ్రేక్ .. ఆమె కారణంగానేనా..?
నగరి నియోజకవర్గంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. 2014,2019 వరుస ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరుఫున సినీ నటి రోజా ఎమ్మెల్యేగా విజయం సాధించారు.2019 ఎన్నికల్లో పార్టీ కూడా అధికారంలోకి రావడంతో ఆమె జగన్ మంత్రివర్గంలో మంత్రిగాపని చేశారు. అయితే గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమెతో పాటు, పార్టీ కూడా దారుణంగా ఓడిపోయింది. రోజాపై గాలి భాను ప్రకాష్ ఘన విజయం సాధించారు.
ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ, గాలి భాను ప్రకాష్ తమ్ముడు జగదీష్ ఇప్పుడు వైసీపీలో చేరడానికి రెడీ అయ్యారు. అన్నతో ఉన్న విభేదాల కారణంగా జగదీష్ వైసీపీలో చేరడానికి సన్నద్ధం అయ్యారు.దీనిలో భాగంగానే గాలి జగదీష్ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌తో భేటీ అయ్యారు. ఈ నెల 12న(బుధవారం) వైసీపీలో చేరాలని భావించారు.అయితే గాలి జగదీష్ పార్టీలో చేరితే రోజా సీటుకు ఎసరొస్తుందనే చర్చ సాగుతోంది.

ఆమె వర్గం జగదీష్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలుస్తోంది. దీంతో జగదీశ్ చేరికకు తాత్కాలిక బ్రేక్ పడింది. రోజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే జగదీష్ చేరిక వాయిదా పడిందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో జగదీష్ నగరి ఎమ్మెల్యే సీటు కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేరిక ఆగిందనే వాదన తెర మీదకు వస్తోంది.
అయితే అలాంటిది ఏమీ లేదని వైసీపీ తెలిపింది. రోజా మద్దతుతోనే గాలి జగదీష్ వైసీపీలో చేరుతున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. గాలి జగదీష్ రాకను రోజా సైతం ఆహ్వానించారని, నగరిలో తిరిగి పార్టీ అధికారంలో తేవడమే లక్ష్యంగా అందరూ కలిసి పని చేస్తారని పార్టీ నాయకులు తెలిపారు. రోజా,జగదీష్ మధ్య ఎలాంటి పోటీ లేదని, ఆమె పార్టీ సీనియర్ నాయకురాలని, ఆమెకు పార్టీలో ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగా పార్టీ తెలిపింది. మంచి రోజు చూసుకుని గాలి జగదీష్ పార్టీలో చేరుతారని పార్టీ వర్గాలు ప్రకటించాయి.












Click it and Unblock the Notifications