హైడ్రామా మధ్య అసెంబ్లీకి రోజా, కార్యదర్శికి కోర్టు ఆర్డర్: స్పీకరే ఫైనల్!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా.. ఉత్కంఠ మధ్య గురువారం మధ్యాహ్నం అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణకు హైకోర్టు కాపీని అందించారు. రోజాపై అసెంబ్లీ ఏడాది పాటు సస్పెండ్ చేయగా, ఆమె హైకోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆమె హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ తీసుకొని ఏపీ అసెంబ్లీకి మధ్యాహ్నం వచ్చారు. ఆమెకు వైసిపి ఎమ్మెల్యేలు స్వాగతం పలికేందుకు సిద్ధం కాగా, మరోవైపు మార్షల్స్ అడ్డుకునేందుకు నిరీక్షించారు. దీంతో రోజా వస్తే ఎంత వాడిగావేడిగా ఉంటుందోననే చర్చ జరిగింది.
అయితే, అప్పటికే ఏపీ అసెంబ్లీ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆర్డర్ కాపీతో వచ్చిన రోజాను అసెంబ్లీ ప్రాంగణంలోకి ఎవరూ అడ్డుకోలేదు. అసెంబ్లీ గేటు వద్ద ఆమెకు వైసిపి ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె కార్యదర్శి కార్యాలయానికి వెళ్లారు.
అక్కడ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణకు కోర్టు ఆర్డర్ కాపీని అందించారు. ఈ సందర్భంగా.. కాపీని స్పీకర్‌కు అందజేస్తానని, నిబంధనల మేరకు నడుచుకుంటానని రోజాకు కార్యదర్శి చెప్పారని తెలుస్తోంది. ఈ కాపీని స్పీకర్‌కు ఇచ్చాక, ఆయన నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.
కార్యదర్శిని కలిసిన వారిలో రోజాతో పాటు ఇతర వైసిపి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కార్యదర్శికి నోటీసు ఇచ్చిన అనంతరం రోజా లోటస్ పాండు బయలుదేరారు. మరోవైపు, రోజాను అసెంబ్లీకి రాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం న్యాయనిపుణులతో చర్చిస్తోంది.
అడ్డుకున్నా..
అసెంబ్లీ గేటు వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్షల్స్ రోజాను మొదట అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రోజా తరుపు న్యాయవాది పోలీసులు, మార్షల్స్‌కు కోర్టు ఆర్డర్ చూపించారు. దీంతో వారు ఆమెను అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించారు. దీంతో ఆమె నేరుగా అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయానికి వెళ్లారు.

ఓ మహిళా ఎమ్మెల్యేను ఇంత ఇబ్బంది పెడతారా!
ఓ మహిళా ఎమ్మెల్యేను ప్రభుత్వం ఇంత ఇబ్బంది పెట్టడం సరికాదని రోజా, వైసిపి ఎమ్మెల్యేలు అంటున్నారు. తాను రేపటి నుంచి అసెంబ్లీకి హాజరవుతానని, తన నియోజకవర్గం సమస్యలను సభలో ప్రస్తావిస్తానని చెప్పారు. రోజాను రూల్ 340 కింద సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రూల్ ఒక సెషన్‌కే వర్తిస్తుందని చెబుతున్నారు.
బడ్జెట్ పైన చర్చకు ప్రతిపక్షానికి అరగంట మాత్రమే సమయం ఎలా సరిపోతుందని జగన్ ప్రశ్నించారు. సభను పది నిమిషాలు వాయిదా వేస్తున్నామని చెప్పి, గంటన్నర పాటు వాయిదా వేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా వాడటం నేరమని చెప్పారు.
సభలో అర్థవంతమైన చర్చ జరగడం లేదన్నారు. ఎఫ్ఆర్బీఎం ప్రకారం 3 శాతానికి మించి ప్రభుత్వం అప్పులు చేయవద్దని చెప్పారు. నిబంధనల ప్రకారం రూ.15వేల కోట్ల అప్పు చేసేందుకు వీలు ఉండగా రూ.22 వేల కోట్ల అప్పులు తెస్తోందని ధ్వజమెత్తారు.
ప్రజల ఆస్తులకు ప్రభుత్వం ట్రస్టీగా ఉండాలని చెప్పారు. ప్రజల డిపాజిట్లకు ట్రస్టీగా ఉండవలసిన ప్రభుత్వం ఇష్టానుసారంగా ఖర్చు చేస్తోందని ధ్వజమెత్తారు. మార్చి నాటికి రూ.40వేల కోట్లను ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. 2014-15 అకౌంట్లను ప్రస్తుత బడ్జెట్లో చూపడం లేదన్నారు.












Click it and Unblock the Notifications