స్పీడ్ బ్రేకర్ వద్ద పోలీస్ జీప్ దూకేసి రక్షించండంటూ పరుగులు తీసిన రోజా
తనను గుంటూరుకు తరలిస్తుండగా రోజా పోలీసు జీపు నుంచి దూకి, తనను కాపాడాలంటూ కేకలు వేస్తూ పరుగులు తీయడం ప్రారంభించారు.
గుంటూరు: పోలీసులు తనను అరెస్టు చేసి జీపులో తరలించే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా సందడి చేశారు. విజయవాడలో జరుగుతున్న పార్లమెంటేరియన్ల మహిళా సదస్సుకు వెళ్తున్న ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా గుంటూరుకు తరలించారు.
పేరేచర్ల సెంటర్‌లో స్పీడ్ బ్రేకర్ వద్ద పోలీస్‌జీప్ నుంచి దూకేసి రోజా హల్‌చల్ సృష్టించారు. కాపాడండి అంటూ కేకలు వేస్తూ రోడ్డుపై ఆమె పరుగు తీశారు. ఆమెను వెంబడించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు ఆహ్వానించి, తనను అరెస్టు చేశారని రోజా అంటున్నారు. సదస్సులో పాల్గొనడానికి అందరు శానససభ్యుల మాదిరిగానే ఆమె కూడా పేరు నమోదు చేసుకున్నారు. సదస్సుకు వెళ్లడానికి ఆమె గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

దలైలామా అక్కడకు వస్తున్నారని చెప్పి రోజాను పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను ఓ గదిలో బంధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆమె చుట్టూ పోలీసులు మోహరించి కదలడానికి కూడా వీలు లేకుండా చూశారు. గంటసేపు ఆమెను విమానాశ్రయంలో నిర్బంధించి ఆ తర్వాత అక్కడి నుంచి తరలించారు.
సదస్సుకు రావాలంటూ ప్రభుత్వ అధికారులు ఆమెను ఆహ్వానించారు. పాస్ కూడా జారీ చేశారు. తీరా విమానాశ్రయానికి వచ్చిన తర్వాత అడ్డుకున్నారు. రోజాను పోలీసులు రోజాను అదుపులోకి తీసుకోవడం దారుణమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జోగి రమేష్, అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications