ఆ వీడియోలున్నాయి: బాబుని ఏకేసిన కల్పన, రోజాపై కఠినంగా.. ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైసిపి ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాల్ మనీ - సెక్స్ రాకెట్ పేరుతో మహిళలతో ఆడుకున్నారని, వారి పైన చర్యలు ఏవని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ దళిత మహిళను అడ్డం పెట్టుకొని తమ పార్టీని, పార్టీ అధినేత జగన్‌ను లక్ష్యంగా చేసుకుందని మండిపడ్డారు. మహిళలు అంటే చంద్రబాబుకు ఎంత గౌరవమో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు ఈడ్చుకెళ్లారన్నారు. అదీ చంద్రబాబుకు మహిళల పైన ఉన్న గౌరవమన్నారు.
కాల్ మనీ - సెక్స్ రాకెట్ దారుణాలు చంద్రబాబుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దళిత మహిళలను అడ్డు పెట్టుకొని కాల్ మనీ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు.
రోజాతో టిడిపి ఎమ్మెల్యేలు దుర్భాషాలడినట్లు తమ వద్ద వీడియోలు ఉన్నాయన్నారు. లేని అధికారాలతో ఆమెను సస్పెండ్ చేశారన్నారు. మహిళల పైన జరుగుతున్న దాడులు చంద్రబాబుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

రోజాపై మరింత కఠిన చర్యలు తప్పవా?
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే అనిత పైన ఘాటు వ్యాఖ్యలు చేసిన వైసిపి ఎమ్మెల్యే రోజా పైన ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతోందా? అంటే కావొచ్చుననే అంటున్నారు. ఇప్పటికే శాసన సభలో మంగళవారం నాడు పలువురు సభ్యులు రోజా పైన మరింత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆమె ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని చాలామంది సభ్యులు డిమాండ్ చేశారు. అంతేకాదు, రోజా పైన కేసులు పెట్టాలనే అంశం పైన పార్టీలో చర్చించనున్నారు. దళిత మహిళా ఎమ్మెల్యే పైన రోజా ఇష్టారీతిగా మాట్లాడారని అధికార పక్షం మండిపడుతోంది. రోజాను జగన్ వెనకేసుకు రావడాన్ని కూడా అధికార పక్షం తప్పుపడుతోంది.
ఏథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసే అవకాశం
రోజా చేసిన అభ్యంతరక వ్యాఖ్యల అంశాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశంలో ఇప్పటికే రోజాను ఏడాది పాటు శాసన సభ నుంచి సస్పెండ్ చేశారు. రోజా వ్యాఖ్యల అంశాన్ని ఎథిక్స్ కమిటికీ అప్పగించాలని సిఫార్సు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications