రికవరీ కోసమే: చంద్రబాబుపై రోజా, స్పీకర్ ఆగ్రహం
హైదరాబాద్: ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బులు రాబట్టుకోవడానికి రాజధాని విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఉపయోగపడే విధంగా వ్యవహరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా ఆరోపించారు. విభజన విషయంలో జరిగన అన్యాయం రాజధాని విషయంలో జరగకూడదనేది తమ ఉద్దేశ్యమని ఆమె గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
రాజధాని విషయంలో తాము ప్రజల మనోభావాలను గౌరవిస్తామని ఆమె చెప్పారు. రాజధాని విషయంపై శాసనసభ్యులందరితో చర్చించాలని ఆమె అన్నారు. మెజారిటీ అభిప్రాయం మేరకు వ్యవహరించాలని ఆమె డిమాండ్ చేశారు. చర్చ చేసిన తర్వాత ప్రభుత్వ భూములు ఉన్న చోట రాజధాని ఏర్పాటు చేయాలని ఆమె అన్నారు. విజయవాడ సమీపంలో రాజధానిని ఏర్పాటు చేయాలనే విషయంలో చంద్రబాబుకు స్వార్థం లేదా ఆమె అడిగారు.

రాజధానిపై ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై చర్చ జరగాలని ఆమె అన్నారు. చర్చ జరిగిన తర్వాత రాజధాని ఎక్కడనే విషయంపై నిర్ణయం జరగాలని రోజా అన్నారు. తమ మీద బురదజల్లే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తోందని, పుట్టిపెరిగిన రాయలసీమకు చంద్రబాబు వ్యతిరేకమా అని ఆమె అన్నారు. మానవతా దృక్పథం లేకుండా రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి చంద్రబాబు సహకరించారని ఆమె విమర్శించారు. రాజధాని విషయంలో కొంత మందిని ధనవంతులను చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. ఫలానా చోటనే రాజధాని ఉండాలని తాము అనడం లేదని, శిమరామకృష్ణన్ కమిటీ నివేదికలోని మంచిచెడులను చర్చించి, నిర్ణయం తీసుకోవాలని తాము అంటున్నామని ఆమె అన్నారు.
అధికారం వచ్చింది కదా అని తెలుగుదేశం పార్టీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. విజయవాడ రియల్ రాజధానిని ఏర్పాటు చేయడానికా, రియల్ ఎస్టేట్ రాజధాని చేయడానికా ఆయన మరో శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. చర్చ జరగాలన్నదే తమ ఉద్దేశ్యమని ఆయన అన్నారు.
సభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుల తీరుపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. రాజధాని అంశంపై చర్చ జరగాలనే డిమాండ్‌తో వైసిపి సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు. సభ వాయిదా పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications