పుష్ప-అఖండ రేట్లే భీమ్లా కు : పవన్ ను తొక్కేయటానికి ఆయనేమైనా... : రోజా ఫైర్..!!
భీమ్లానాయక్ మూవీ రిలీజ్ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏపీలో ఇప్పుడు రాజకీయ వివాదంగా మారాయి. జనసేన అధినేత పవన్ లక్ష్యంగా సినీ పరిశ్రమను ఏపీ ప్రభుత్వం వేధిస్తోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పవన్ నటించిన భీమ్లానాయక్ కు తెలంగాణలో అయిదో షో కు అనుమతి ఇచ్చారు. ఏపీలో మాత్రం పాత నిర్ణయాలనే అమలు చేస్తున్నారు. సీఎం జగన్ తో చిరంజీవి టీం సమావేశమైన సమయంలో అన్ని సమస్యలు పరిష్కారం అయినాయని చెప్పినా..జీవో విడుదల చేయకపోవటంతో టికెట్ ధరలు పెరగలేదు.
Recommended Video

భీమ్లా పొలిటికల్ వివాదం
అదే సమయంలో థియేటర్లకు రెవిన్యూ అధికారులు నోటీసులు జారీ చేయటం కూడా వివాదాస్పదమైంది. ఇక, దీని పైన తాజాగా మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. పవన్ ను ఏపీ ప్రభుత్వం వేధిస్తోందంటూ విమర్శించారు. పవన్ కల్యాణ్ పై పగపట్టి ఇంత చేస్తుంటే ఎవరు నోరు మెదపడం లేదు. సినిమా పెద్దలు కళ్యాణ్ కు మద్దతు ప్రకటించకపోవడం దురదృష్టకరం.
నిర్మాతలు, దర్శకులు, హీరోలకు ఇది తప్పు అని చెప్పడానికి ఎందుకు ధైర్యం చాలడం లేదు. ఒక అగ్ర హీరోకే ఇంత జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటీ. సినీ పరిశ్రమ భయాన్ని, అభద్రతా భావాన్ని పవన్ అర్థం చేసుకుంటున్నాడు. ఏ హీరోకైనా, ఏ నిర్మాతకైనా, ఏ దర్శకుడికైనా ఇలాంటి సమస్య వస్తే మేం ముందుటాం. మీరు మమ్మల్ని వదిలేసినా మా సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చారు.

రోజా సీరియస్ వ్యాఖ్యలు
ఇక, ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం పైన వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా స్పందించారు. పవన్ కళ్యాణ్ ను తొక్కేయాలని మేమెందుకు చూస్తాం.. అయినా ఆయన ప్రొడ్యూసరా.. లేక డిస్టిబ్యూటరా..అంటూ ప్రశ్నించారు. టికెట్ ధరల నిర్ణయం ఒక కొలిక్కకి వస్తుందనుకునే సమయంలో మంత్రి గౌతమ్ రెడ్డి మరణించడంతో కాస్త ఆలస్యం అయ్యింది.. ఈ లోగా సినిమా రిలీజ్ అయ్యింది, అని రోజా వివరణ ఇచ్చారు. అలాగే తన సినిమాను అడ్డుపెట్టుకొని తమ పార్టీని నిలబెట్టుకోవాలని పవర్ రాజకీయం చేస్తున్నారని రాజా ఫైర్ అయ్యారు.

పుష్ఫ- అఖండ ధరలే..ఇప్పుడూ
అల్లు అర్జున్ పుష్ప, బాలకృష్ణ అఖండ సినిమాలకు ఏ రేట్లయితే ఉన్నాయో, ఇప్పుడూ అవే రేట్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇందులో అన్యాయం ఏముందని ప్రశ్నించారు. రేట్లు పెంచుకోవాలంటే జాయింట్ కలెక్టర్లకు అప్లై చేసుకోవచ్చుకదా అంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఏపీ ప్రభుత్వం మేలు చేసిందన్నారు. మూడు వందలకు పైగా ధర చెల్లించి కొనే టికెట్ ఇప్పుడు రూ 150 కే దొరికిందని చెప్పుకొచ్చారు. ఇక, రోజా తాజా వ్యాఖ్యల పైన అటు పవన్ క్యాంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications