తల్లికి వందనంలో రూ. 2,000 ఎందుకు కట్?
Roja: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై.. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్ కే రోజా విమర్శలు గుప్పించారు. తల్లికి వందనం పథకం పేరుతో మోసం చేస్తోందంటూ ఆరోపించారు.
ఎన్నికల సమయంలో తల్లికి వందనం పథకం పేరుతో ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తామని ఓట్లు వేయించుకొని, అధికారంలోకి వచ్చిన తరువాత మోసం చేస్తే అలాంటి వారిని ఏమనాలని రోజా ప్రశ్నించారు. తల్లికి వందనం పథకం పేరుతో కూటమి సర్కార్ చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

సూపర్‌సిక్స్ పథకాల్ని అమలు చేశామని, ఇకపై వాటి గురించి ప్రశ్నిస్తే, నాలుక మందమని అనుకోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడాన్ని ఆమె తప్పుపట్టారు. ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం పథకం కింద 15,000 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి అందులో ఏకంగా రూ. 2,000 ఎందుకు కోత పెట్టారని ప్రశ్నించారు.
అడ్డగోలు షరతులతో తల్లికి వందనం పథకాన్ని కొందరికే పరిమితం చేశారని రోజా ధ్వజమెత్తారు. తల్లులకు మోసం చేసిన చంద్రబాబును ఏమనాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పథకాన్ని నీరుగార్చుతున్నారని విమర్శించారు.
సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ, మరోవైపు షరతులతో వాటికి కోత విధిస్తుండడం నిజం కాదా? అని నిలదీశారు. తాజాగా తల్లికి వందనం పథకాన్ని ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్రీయ విద్యాలయా విద్యార్థుల్ని మొత్తానికి మొత్తం అనర్హులుగా చేయడం నిజం కాదా? అని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వ హయాంలో కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల ప్రతి తల్లీకి అమ్మ ఒడి లబ్ధి చేకూర్చామని, ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర అధికారికంగా ఉన్నాయని రోజా గుర్తు చేశారు. ఎగ్గొట్టే కుట్రతో యూడైస్ ప్లస్ నుంచి కేవీ సంస్థలను కట్ చేసినట్టు, దాంతో తాము తల్లికి వందనం పథకానికి దూరమవుతున్నామని తల్లులు వాపోతున్నారని చెప్పారు.
పేరుకు అందరికీ పథకాన్ని అమలు చేస్తున్నామంటూ, మరోవైపు ఎగ్గొట్టారనేందుకు మచ్చుకు ఇదో ఉదాహరణ మాత్రమేనని రోజా వ్యాఖ్యానించారు. ఇలాంటి విన్యాసాలు మున్ముందు కూటమి ప్రభుత్వం ఇంకెన్ని చేస్తుందో అనే ఆందోళన ప్రజల్లో నెలకొని ఉందని, అందుకే వైఎస్ జగన్ అంటే నమ్మకం, బాబు అంటే మోసం అని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications