జగన్ దీక్ష చేస్తే చంద్రబాబు హైలెట్ చేయడానికి ఎల్లో మీడియా: రోజా
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా రాష్ట్ర ప్రజల కోసం దీక్ష చేస్తే ఎల్లో మీడియా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని హైలెట్ చేయడానికి, రాష్ట్రాన్ని ముంచేయడానికి కూడా వెనకాడలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలంతా జగన్ వెంట ఉంటేనే ప్రత్యేక హోదా పోరాటానికి బలం వస్తుందని ఆమె అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చినా, కొత్త రాజధానికి శంకుస్థాపన చేసినా రాష్ట్రానికి ఉపయోగపడే అంశాలేవీ ప్రస్తావనకు రాలేదని ఆమె అన్నారు. ప్రధాని రెవెన్యూ లోటు గురించి మాట్లాడలేదని, పోలవరం ప్రాజెక్టునూ ప్రస్తావించలేదని, అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదని ఆమె అన్నారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనకబడిన ప్రాంతాలని, ఇక్కడ రాజధాని లేదు, పరిశ్రమలు లేవని అన్నారు. ఎపికి ప్రత్యేక హోదా లేదని, కనీసం చంద్రబాబు, మంత్రులు భజన కొట్టినట్లు ప్రత్యేక ప్యాకేజీ కూడా రాలేదని ఆమె అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ప్రజలు జగన్ అడుగులో అడుగు వేయాలని ఆమె అన్నారు.
ఇదిలావుంటే, రాజధాని శంకుస్థాపన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ ప్రకటన చేస్తారని కొండంత ఆశతో ఉన్న రాష్ట్ర ప్రజలకు నిరాశే మిగిలిందని సీపీఐ నేత నారాయణ అన్నారు. ప్రధాని మోడీ, వెంకయ్య తెలివిగా మాట్లాడి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
ఖాళీ కుండను ప్రజల నెత్తినపెట్టి.. మట్టి ఇచ్చి ప్రత్యేక హోదాను గంగలో కలిపారని ఆయన గురువారం మీడియా వద్ద వ్యాఖ్యానించారు. మోడీని చంద్రబాబు ఎంత ప్రాధేయపడినా అవమానమే మిగిలిందన్నారు. ఇప్పటికైనా కాషాయం కాకను చంద్రబాబు తెలుసుకోవాలని హితవు చెప్పారు.












Click it and Unblock the Notifications