ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఆర్పీ ఠాకూర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ నియమితులయ్యారు. రెండేళ్ల కాలపరిమితితో ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా ఠాకూర్ విధులు నిర్వహిస్తారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక, ఇప్పటికే ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని కూడా క్రమబద్ధీకరిస్తూ జనవరి 28న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్లుగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావుపై రెండు దఫాలుగా సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. మొదటిసారి 2020 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 2022 ఫిబ్రవరి 7వ తేదీ వరకు, రెండో విడతలో 2022 జూన్ 28వ తేదీ నుంచి 2024 మే 30 తేదీ వరకు మరోసారి అప్పటి జగన్ ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
అయితే, ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుపై నమోదైన అభియోగాలను ఎత్తివేసింది. సరైన ఆధారాలు లేవని, విచారణను వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే సస్పెన్షన్ కాలంలో ఏబీ వెంకటేశ్వరరావుకు చెల్లించాల్సిన వేతనాన్ని, అలవెన్సులను ప్రభుత్వం చెల్లించనుంది.












Click it and Unblock the Notifications