ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్: పాన్ ఇండియా మూవీల విడుదల డౌట్
అమరావతి: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇదివరకటి రోజులతో పోల్చుకుంటే- ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క రోజు వ్యవధిలో 75 కొత్త ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడిన వారి సంఖ్య 653కు చేరింది. ఒమిక్రాన్ వల్ల ఇప్పటిదాకా మరాణాలేవీ నమోదు కాకపోవడం ఊరట కలిగిస్తోంది.

653కు చేరిన ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఇప్పటిదాకా ఒమిక్రాన్ వేరియంట్ 21 రాష్ట్రాలకు విస్తరించింది. కొత్తగా మణిపూర్, గోవా ఒమిక్రాన్ బాధిత రాష్ట్రాల జాబితాలో చేరాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 653కు చేరగా.. ఇందులో 186 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యంతో కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 467గా రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రాలవారీగా వాటి సంఖ్యను వెల్లడించింది. ఢిల్లీ, మహారాష్ట్రల్లో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు చోట్ల కూడా 332 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఇందులో మహారాష్ట్ర-167, ఢిల్లీ-165 పాజిటివ్ కేసులు ఉన్నాయి.

పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలోకి..
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలోకి వెళ్లాయి. సరిహద్దులను మూసివేశాయి. ఢిల్లీ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులనూ మూసివేసింది. పరిస్థితులు మెరుగు పడేంత వరకూ అవి తెరచుకునే అవకాశం లేదు. ఇప్పట్లో ఒమిక్రాన్ భయాందోళనలు తొలగిపోయే వాతావరణం కూడా కనిపించట్లేదు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు సినిమా హాళ్లపై ఆంక్షలను విధించాయి. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి.

బాలీవుడ్ వాయిదాల బాట..
దేశంలో నెలకొన్న తాజా పరిణామాల.. పాన్ ఇండియా సినిమాలపై పడింది. బాలీవుడ్ ఇప్పటికే వాయిదాల బాట పట్టింది. ఈ నెల 31వ తేదీన విడుదల కావాల్సిన జెర్సీ సినిమా వాయిదా నిరవధికంగా వాయిదా పడింది. క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌తో నేచురల్ స్టార్ నాని-శ్రద్ధ శ్రీనాథ్ జంటగా తెలుగులో వచ్చిన జెర్సీ మూవీకి రీమేక్ ఇది. షాహిద్ కపూర్-మృణాల్ కపూర్ హీరో హీరోయిన్లు. ఈ సినిమాను నిరవధికంగా వాయిదా వేసింది యూనిట్. ఎప్పుడు విడుదల చేస్తామనేది స్పష్టం చేయలేదు.

ఈ పాన్ ఇండియా సినిమాలకు దెబ్బ..
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మచ్ అవైటెడ్ మూవీస్ ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్‌లపైనా పడే అవకాశం లేకపోలేదు. ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవే. ఎన్నో అంచనాల మధ్య విడుదల కావాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ నటించిన ఈ సినిమా జనవరి 7వ తేదీన విడుదల కానుంది. సరిగ్గా వారం రోజుల గ్యాప్‌తో రాధేశ్యామ్ విడుదలను షెడ్యూల్ చేశారు. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం.. జనవరి 14న రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

విడుదల డౌటే..
వందల కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ సినిమాలకు ఎలాంటి పోటీ ఉండకూడదనే కారణంతో- మహేష్‌బాబు, పవన్ కల్యాణ్ నటించిన సర్కారువారి పాట, భీమ్లానాయక్ నిర్మాతలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిచెందుతోండటం ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ నిర్మాతలను కలవరపాటుకు గురి చేస్తోంది. జెర్సీ మూవీ విడుదల వాయిదా పడటం వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

భారీగా ప్రమోషన్..
ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ట్రిపుల్ ఆర్ టీమ్ బాలీవుడ్‌ను కేంద్రంగా చేసుకుని ప్రమోషన్స్‌ను చేపట్టింది. ముంబైలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తోన్న బిగ్‌బాస్ సీజన్ 15లోనూ సందడి చేసిందీ టీమ్. కపిల్ శర్మ షోలో కూడా కనిపించనుంది. ఆలియాభట్, అజయ్ దేవ్‌గణ్‌లను తీసుకోవడంతో పాన్ ఇండియా లుక్ వచ్చింది ట్రిపుల్ ఆర్‌కు. రాధేశ్యామ్ హీరో ప్రభాస్ ఇదివరకే పాన్ ఇండియా సూపర్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ ఇంకా మొదలు పెట్టాల్సి ఉంది.

అన్ని రాష్ట్రాల్లోనూ..
సినిమాల విడుదలకు అన్నీ సిద్ధం చేసుకున్న తరువాత ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోండటం అలజడిని రేపింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువే అయినప్పటికీ.. మున్ముందు పెరగబోవనే గ్యారంటీ లేదు. సినిమా హాళ్లకు వెళ్లలేని పరిస్థితి ఉండటం.. పెద్ద సినిమాలు వాయిదా పడటానికి కారణం కావచ్చనే ప్రచారం ఉంది.












Click it and Unblock the Notifications