ఈ జిల్లా ఆదుకుంది, రూ.వెయ్యి కోట్లు ఇచ్చా: బాబు, మోసపోయారు: భూమన
విజయవాడ: తనను పశ్చిమ గోదావరి జిల్లా అన్ని రకాలుగా ఆదుకుందని, ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీలలో చేరుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు అన్నారు. ఏరువాకను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాపులకు ఎంతోమంది హామీలు ఇచ్చి ఏమీ చేయలేదని విమర్శించారు. కాపులకు రూ.వెయ్యి కోట్లు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. నదుల అనుసంధానంతో తాగునీటి కొరత ఉండదని చెప్పారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.
త్వరలో రూ.149కే ఇంటింటికి ఇంటర్నెట్ అందిస్తామని చెప్పారు. ఈ ఏడాది నుంచి క్రాప్ విధానం అమలు చేస్తామన్నారు. పంట పొలాలకు గతంలో భూసార పరీక్షలు జరిగేవి కాదని, భూసార పరీక్షల్లో దేశంలోనే ఏపీ ముందంజలో ఉందని చెప్పారు.

నమ్మి మోసపోయారు: భూమన
చంద్రబాబును నమ్మి ప్రజలు మోసపోయారని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఒక్క దానిని కూడా అమలు చేయడం లేదన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని వివిధ కులాల వారికి హామీలిచ్చారన్నారు. వాస్తవాలను ప్రసారం చేస్తున్న మీడియా గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు.
రైతులను కుంగదీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మరో వైసిపి నేత పార్థసారథి అన్నారు. రైతులకు ఒక దిక్సూచీ లేకుండా వ్యవసాయ విధానం చేపడుతున్నారన్నారు. నీరు, విత్తనాలు, ఎరువులు ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా ఏరువాక ఎందుకని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications