కేసీఆర్‌కి ధీటుగా బాబు 'హైటెక్': ఆఫీస్ కోసం 10 కోట్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేటాయించిన కార్యాలయం ఆధునీకరణ కోసం పది కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని వార్తలు వస్తున్నాయి. సచివాలయంలోని ఎల్ బ్లాకులో బాబు కోసం హైటెక్ తరహాలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చంద్రబాబుతో సుదీర్ఘ చర్చల తర్వాత రోడ్లు భవనాల శాఖ ఇందు కోసం ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉపయోగిస్తున్న కార్యాలయాన్ని తలదన్నే విధంగా తన కార్యాలయం ఉండాలన్నది టీడీపీ ఆరాటమట! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు సైతం అబ్బురపడేలా సిఎం కార్యాలయం ఉండాలనుకంటున్నారట.

చంద్రబాబు ఛాంబర్‌తో పాటు, మంత్రివర్గ సమావేశాలకోసం మీటింగ్ హాలు, వీడియో కాన్ఫరెన్స్ కోసం మరో హాలు, విజిటర్ల కోసం ఒక గది, ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే ముఖ్యకార్యదర్శులకు ఛాంబర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఎనిమిదో అంతస్తులో బాబు ఉపయోగించే ఛాంబర్‌తో పాటు మంత్రివర్గ సమావేశం హాలు, వీడియో కాన్ఫరెన్స్ హాళ్లను బుల్లెట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్‌గా మారుస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు ఎల్ బ్లాకులోనే ఏడో అంతస్తులో కేటాయించిన ఛాంబర్‌ను జూన్ ప్రారంభం నుండే ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కేటాయించిన నిధులను ఎల్ బ్లాకు ఎనిమిదో అంతస్తు ఆధునీకరణ కోసమే వినియోగించాలని నిర్ణయించారట.
ప్రస్తుతం కెసిఆర్ ఉపయోగిస్తున్న సి బ్లాకులోని కార్యాలయం గతంలో చంద్రబాబు ఉపయోగించినదే. బాబు హయాంలోనే అన్ని హంగులతో దాన్ని తీర్చిదిద్దారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఇదే కార్యాలయంలో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఎలాంటి మార్పులు లేకుండా ఈ ఛాంబర్‌ను ఉపయోగించారు.
సచివాలయంలో ఉన్న భవనాలను ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు కేటాయించిన తర్వాత రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులకు వేర్వేరు భవనాలు లభించాయి. రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఇతర అధికారులు తమకు కేటాయించిన ఛాంబర్లను చిన్నచిన్న మార్పులు చేర్పులు చేసి గత నెల రోజుల నుండే ఉపయోగిస్తున్నారు. కేసీఆర్ జూన్ ప్రారంభం నుండే తనకు కేటాయించిన భవనాన్ని ఉపయోగిస్తున్నారు.
చంద్రబాబు కోసం వేర్వేరు బ్లాకులను పరిశీలించారు. హెచ్ సౌత్ బ్లాకును ఉపయోగించాలని తొలుత భావించినప్పటికీ, ఆ తర్వాత ఈ భవనాన్ని ఇతర మంత్రులకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులంతా తమ తమ ఛాంబర్లను ఆధునీకరించుకుని ఉపయోగిస్తున్నారు. వాస్తుతో పాటు అన్ని కోణాల్లో ఆలోచించి ఎల్ బ్లాకు ఎనిమిదో అంతస్తును చంద్రబాబు కోసం ముస్తాబు చేయాలని తాజాగా నిర్ణయించారు.












Click it and Unblock the Notifications