ఏపీకి రూ.50474 కోట్లు- కేంద్రమంత్రి సంచలన ప్రకటన..!
ఏపీలో తాజాగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి కేంద్రం వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతోంది. తాజాగా కేంద్ర బడ్జెట్ లోనూ అమరావతి రాజధాని, వెనుక బడిన జిల్లాలకు సాయం సహా పలు సాయాలు ప్రకటించింది. ఏపీతో పాటు బీహార్ కు మాత్రమే ఈసారి బడ్జెట్ లో ప్రాధాన్యత దక్కింది. ఆ తర్వాత రైల్వే శాఖ కూడా రూ.9 వేల కోట్ల ప్రాజెక్టులు ప్రకటించింది. దీంతో ఈసారి బడ్జెట్ లో ఏపీకి భారీ మొత్తంలో సాయం దక్కినట్లయింది.
ఈసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టాక దీన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు ఎప్పటిలాగే కేంద్రమంత్రుల్ని ప్రధాని మోడీ రంగంలోకి దింపారు. ఇందులో భాగంగా ఏపీకి అందించిన సాయాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు కేంద్రమంత్రి ఎల్ మురుగన్ విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఈసారి కేంద్ర బడ్జెట్లో ఏపీకి అందించిన సాయమెంతో వెల్లడించారు. అమరావతి రాజధాని, ఫోలవరం, వెనుక బడిన ప్రాంతాలకు సాయం సహా మొత్తం రూ.50474 కోట్ల కేటాయింపులు చేసినట్లు మురుగన్ వెల్లడించారు.

విశాఖ-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లకు బడ్జెట్ లో ఈసారి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. అలాగే ప్రతిష్టాత్మక పూర్వోదయ పథకంలో ఏపీని చేర్చినట్లు వెల్లడించారు. దీంతో జార్ఖండ్ నుంచి ఏపీ వరకూ ఉన్న తూర్పుతీరాన్ని గ్రోత్ ఇంజన్ గా మార్చబోతున్నట్లు తెలిపారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు మురుగన్ వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 2040 లక్ష్యంగా కేటాయింపులు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications