రవాణా పన్నుపై తెలంగాణకు గడ్కరీ బాసట
హైదరాబాద్/ ఖమ్మం: ప్రైవేట్ వాహనాలపై రవాణా పన్ను వసూలు చేయాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బాసటగా నిలిచారు. రవాణా పన్ను వసూలు తెలంగాణ ప్రభుత్వ ఇష్టమని ఆయన అన్నారు. బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆర్టీసీ విభజన వీలైనంత త్వరగా పూర్తి అవుతుందని దీనిపై ఇరు రాష్ర్టాల మంత్రులు, అధికారులతో ఢిల్లీలో చర్చించనున్నట్లు గడ్కరీ తెలిపారు.కేంద్రం జలరవాణాపై దృష్టిపెట్టిందని కేంద్రమంత్రి ఆయన చెప్పారు. మరోవైపు నెలరోజుల్లో ఆర్టీసీ విభజన జరుగుతుందని గడ్కరీ హామీ ఇచ్చినట్లు తెలంగాణ రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని రహదారులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి దగ్గర 221 వ జాతీయ రహదారికి ఆయన బుధవారంనాడు శంకుస్థాపన చేశారు. దేశంలో జలమార్గాలను అభివృద్ధి చేయడం బీజేపీ ప్రధానమైన లక్ష్యమని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో రివర్ పోర్టులను ఏర్పాటు చేస్తామన్నారు. వీటి ద్వారా ప్రయాణికులు,పారిశ్రామిక ఉత్పత్తుల రవాణా చేయోచ్చని పేర్కొన్నారు. దేశంలో 5 జలమార్గాలకు రూపకల్పన చేశామన్నారు
వారణాసిలో గంగానదిపై త్వరలో జలమార్గం అందుబాటులోకి తెస్తామని తెలిపారు. రూ.5 లక్షల కోట్లతో నదులపై జలమార్గాలు ఏర్పాటు చేస్తామని, రోడ్డుపై ప్రయాణిస్తే రూ.1.5 ఖర్చవుతుండగా.. రైలుమార్గంలో రూ.1, జలమార్గంలో 50 పైసలే ఖర్చవుతుందని అన్నారు.
జలమార్గం ద్వారా పారిశ్రామిక ఉత్పత్తుల రవాణా వల్ల ఖర్చు చాలా తగ్గుతుందని తెలిపారు.సిమెంట్‌తో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టే విధంగా కేంద్రం సంస్కరణలు తీసుకువస్తుందని తెలిపారు. ఇందుకోసం 107సిమెంట్ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. ఈమేరకు కేంద్రం వద్ద రూ.95 లక్షల టన్నులకుపైగా సిమెంట్ అందుబాటులో ఉందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications