ఉచిత బస్సు ప్రయాణీకులకు మరో వరం, ఇక నుంచి కొత్తగా..!!
ఉచిత బస్సు ప్రయాణం అమలు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గత ఏడాదిలో మొదలు పెట్టిన ఈ పథకం అమలు తీరును ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోంది. ఇప్పటి వరకు అయిదు కేటగిరీల్లో ఈ పథకం అమలు చేస్తున్నారు. కాగా.. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది. ఉచిత బస్సు ప్రయాణం విస్తరించాలని భావిస్తోంది. కేంద్రం నుంచి కొత్తగా అందుబాటులోకి వస్తున్న ఈ బస్సుల్లోనూ ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఏపీలో కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి & కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష చేసారు. ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ బస్సు సేవ పథకం ద్వారా అందనున్న ఈ ఎలక్ట్రిక్ బస్సులకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో నిధులను అందిస్తున్నాయి. తద్వారా ఆంధ్రప్రదేశ్లోని 11 నగరాలకు ఈ ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. అందులో 12 మీటర్ల వైశాల్యంతో, 35+1 సీటింగ్ గల బస్సులు 621, 9 మీటర్ల వైశాల్యంతో 25+1 సామర్థ్యంతో మరో 129 బస్సులు, వెరసి 750 బస్సులను ఆంధ్రప్రదేశ్ కు తీసుకురాబోతున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల వివరాలు, మౌలిక వసతుల ఏర్పాటు, ఛార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ సరఫరా అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు పర్యావరణహిత, సౌకర్యవంతమైన మరియు ఆధునిక రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని సమావేశంలో పేర్కొన్నారు.

డిపోల వారీగా కేటాయింపులు
వీటి ద్వారా పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఉపయోగపడనున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా బస్సుల నిర్వహణకు అవసరమైన డిపోలు, ఛార్జింగ్ మౌలిక వసతులు, విద్యుత్ లోడ్ సామర్థ్యంపై ట్రాన్స్కో అధికారులు వివరాలు సమర్పించారు. త్వరితగతిన అన్ని ప్రక్రియలు పూర్తి చేసి, 2026 ఏడాది చివరికల్లా ఈ - బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. విశాఖపట్నం - 100, విజయవాడ - 100, గుంటూరు - 100, నెల్లూరు - 100 , కర్నూలు - 50, కాకినాడ - 50 , రాజమహేంద్రవరం - 50, కడప - 50, అమరావతి - 50, తిరుపతి - 50, అనంతపురం - 50 చొప్పున కేటాయించారు.













Click it and Unblock the Notifications