ఆ జిల్లాలో ఓడినా టీడీపీదే హవా ... జగన్ ఆ నిర్ణయంతోనే వైసీపీ నేతలకు పెద్ద చిక్కు
గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ని ఓడించి వైసిపి అధికారాన్ని హస్తగతం చేసుకున్నా చాలా జిల్లాల్లో వైసీపీ నేతల్లో ఆ ఆనందం కనిపించటం లేదు. అందుకు కారణం జిల్లాలో మంత్రిగా అవకాశం ఇచ్చిన నాయకులు కొత్తవారు కావడం ఒకటైతే, గతంలో టీడీపీ హవా కొనసాగిన జిల్లాల్లో ఇప్పటికీ అదే పంధా కొనసాగుతుండడం కారణం. ముఖ్యంగా టిడిపికి కంచుకోటగా భావించిన అనంతపురం జిల్లాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక కోణంలో ఇచ్చిన మంత్రి పదవి ఆ జిల్లాకు చేటు తెచ్చిందని అక్కడి నేతలు ఇప్పుడు వాపోతున్నారని సమాచారం .

జిల్లాలో మంత్రి మాట కూడా చెల్లుబాటు కాని వైనం .. వైసీపీ శ్రేణుల్లో అసహనం
బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా శంకర నారాయణకు అవకాశం ఇచ్చారు జగన్. పెద్దగా అనుభవం లేని, అనంతపురం లో ఉన్న దిగ్గజ నేతలకు దీటుగా సమాధానం చెప్పలేని మంత్రి గారి వల్ల వైసిపి నేతలు తలలు పట్టుకుంటున్నారు. దీంతో గతంలో టీడీపీ కంచుకోట అయిన అనంతలో మంత్రిగారి మాట కాని, వైసీపీ ఎమ్మెల్యేల మాట కాని వినే వారు లేరని లబోదిబోమంటున్నారు. జెసి దివాకర్ రెడ్డి, పరిటాల సునీత, రఘువీరారెడ్డి వంటి సీనియర్ నేతలు మొదటి నుంచి అనంతపురం జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఇక గత ఎన్నికల ముందు వరకు అనంతపురం జిల్లా టిడిపికి కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో వైసిపి నేతలు మొత్తం 14 ఎమ్మెల్యే సీట్లకుగాను 12 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలను గెలుచుకొని విజయకేతనం ఎగురవేశారు. అనంత రాజకీయాలను శాసించిన జెసి దివాకర్ రెడ్డి వంటి నేతలకు షాక్ ఇచ్చారు. అంత వరకు బాగానే ఉన్నా 12 మంది ఎమ్మెల్యేలు అనంతపురం జిల్లాలో అధికారులతో పనులు చేయించడంలో విఫలమవుతున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేల మాట వినని అధికారులు .. టీడీపీ నేతల మాట వింటున్నారని వైసీపీ నేతల ఆగ్రహం
అనంతపురం జిల్లాలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకే అధికారులు చుక్కలు చూపిస్తున్నారని సమాచారం. కనీసం ప్రజలకు అవసరమైన వివిధ పనులు చేయడానికి కూడా ఏవో కారణాలు చెబుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది . దీంతో అధికారంలో ఉన్న పార్టీయేనా తమది అని వైసీపీ నేతలు ఇప్పుడు వైసీపీ పెద్దల వద్ద వాపోతున్నారు. ఇక మంత్రిగా శంకరనారాయణ మాటకూడా ఎవరు లెక్క చేయడం లేదు. మొదటిసారిగా శంకర్ నారాయణకు సామాజిక వర్గ కోణంలో మంత్రిగా అవకాశం రావడంతో ఆయనను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక మొదటి నుండి అనంత రాజకీయాలను శాసించిన నేతలే ఎన్నికల్లో ఓటమి పాలైన ప్పటికీ తమ హవా కొనసాగిస్తున్నారు.

సీనియర్ నాయకుడికి మంత్రి ఇవ్వకనే ప్రాధాన్యత కోల్పోయామనే భావనలో వైసీపీ నేతలు .. జగన్ కు విజ్ఞప్తి
అనంత రాజకీయాల్లో బలమైన నాయకుడు, సీనియర్ అయిన వ్యక్తికి మంత్రిగా అవకాశం ఇచ్చి ఉంటే జిల్లాలో ఈ పరిస్థితి ఉండేది కాదని వైసిపి నేతల అభిప్రాయం. ఇక మంత్రివర్గంలో సీనియర్లను పక్కనపెట్టి జగన్ తీసుకున్న నిర్ణయంతో కొత్తగా వచ్చిన మంత్రుల మాటలను ఏ అధికారి వినడం లేదని తెలుస్తుంది.. టీడీపీ కంచుకోట అయిన అనంతపురంలో ఇప్పుడు వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చినా వారి మాటలు చెల్లడం లేదన్న బాధ అధికార పార్టీ ఎమ్మెల్యేలను తీవ్రంగా వేధిస్తుంది. టీడీపీ నేతలకు మాత్రం ఇట్టే పనులు అయిపోతున్నాయనేది వారి వాదన. టీడీపీ అధికారంలో లేకున్నా ఆ జిల్లాపై ఇంకా ఆధిపత్యం చెలాయించడం స్థానిక వైసీపీ నేతలకు తల కొట్టేసినట్టుగా ఉంటుందని తెలుస్తుంది. అందుకే అనంతపురం జిల్లాలో అధికార పార్టీ గా పనులు చేయించాలంటే బలమైన నేతలకు ప్రభుత్వాన్ని నడిపించే పదవులు ఇవ్వాలని అనంతపురం వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని, స్థానిక పరిస్థితులను, అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడానికి వైసిపి నేతలు రెడీ అవుతున్నారు.












Click it and Unblock the Notifications