కేంద్రం క్లియర్..ఇక వైసీపీ యాక్షన్ ప్లాన్: మూడు రాజధానులకు అనుకూలంగా.. రాష్టవ్యాప్తంగా.. !
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి జగన్ సర్కార్ చేస్తోన్న ప్రయత్నాలను నిరసిస్తూ అమరావతి ప్రాంత రైతులు, పరిరక్షణ కమిటీ నాయకులు జాతీయ స్థాయిలో ఉద్యమానికి సిద్ధపడుతున్న వేళ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో దిగింది. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా తన వైఖరిని స్పష్టం చేసిన కొద్ది సేపటికే వైఎస్ఆర్సీపీ తన కార్యాచరణ ప్రణాళికను వెల్లడించింది.

రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలకు వైసీపీ శ్రీకారం..
ఏపీ వికేంద్రీకరణ చట్టానికి అనుకూలంగా.. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి గల కారణాలు.. వాటి అవసరాలను ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకుంది. దీనికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా చర్చాగోష్ఠిలు, సదస్సులు, సమావేశాలను నిర్వహించడానికి కసరత్తు చేపట్టింది. వారం రోజుల పాటు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడించారు.

మానవ హారాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు..
తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీని ప్రకారం.. ఈ నెల 6వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా మానవహారం కార్యక్రమాలు నిర్వహించనున్నారు అధికార పార్టీ నాయకులు. 7వ తేదీన కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టనున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ 8వ తేదీన దేవాలయాల్లో పూజలు చేయనున్నారు.

రౌండ్ టేబుల్ సమావేశాలు..
దీనితో పాటు- 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. 12వ తేదీన వంటా వార్పు, 13వ తేదీన రిలే నిరాహార దీక్షలు, 14వ తేదీన గులాబీ పూలు, కరపత్రాలు పంపిణీ చేస్తారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఈ కరపత్రాల ద్వారా తెలియజేస్తారు. 15వ తేదీన రాష్ట్రంలోని అన్ని అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాల అందజేస్తారు.

యూనివర్శిటీల్లో సదస్సులు..
ఈ నెల 10వ తేదీన అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో సదస్సులను నిర్వహిస్తారు. 12వ తేదీన విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ, 14వ తేదీన తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సదస్సులను నిర్వహిస్తామని జక్కంపూడి రాజా వివరించారు. ఈ అవగాహన కార్యక్రమాల చివరి రోజు- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించేలా బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తున్నామని, దీనిపై ఇంకా ఏ నిర్ణయాన్నీ తీసుకోలేదని అన్నారు.












Click it and Unblock the Notifications