• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మోడీని కలుస్తా, జగన్ దిష్టిబొమ్మ దగ్ధంతో తృప్తి: సబ్బం

By Srinivas
|

విశాఖపట్నం: తాను త్వరలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి నేత సుష్మా స్వరాజ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణలను కలుస్తానని, 2009లో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచాను కాబట్టి ఎంపీగా ఉన్నంతకాలం పార్టీ దేనికి ఓటు వేయాలని చెబితే దానికే వేస్తానని గతంలోనే చెప్పానని, ఆ మాటకే కట్టుబడి ఉన్నానని అనకాపల్లి ఎంపి సబ్బం హరి మంగళవారం అన్నారు. ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడిన విషయం తెలిసిందే.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను టార్గెట్ చేయడం ఆపాల్సిందిగా సూచించానని, లేదంటే తానూ ప్రతి చర్యలకు దిగాల్సి వస్తుందని చెప్పినా తన దిష్టిబొమ్మలు ఆ పార్టీ వారు దగ్ధం చేశారని ఆరోపించారు. ప్రతిగా మంగళవారం జిల్లాలో తన అభిమానులు జగన్ దిష్టిబొమ్మలు దహనం చేశారన్నారు. నర్సీపట్నంలో ఎమ్మెల్యే ఇరువర్గాలను సమావేశపరిచి ఈ పద్ధతి మంచిదికాదని చెప్పి, తనకు ఫోన్ చేసి వివాదం వద్దని కోరడంతో అందుకు సమ్మతించానన్నారు.

Sabbam Hari

తన అభిమానులు బుధవారం కూడా జగన్ దిష్టిబొమ్మల దహనానికి ఏర్పాట్లు చేసుకుంటే తానే వారించానన్నారు. జగన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసినందుకు కొంత బాధపడినా, అలా జరిగినందుకు తృప్తిగా ఉందని హరి పేర్కొన్నారు. జగన్‌కి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తన దిష్టిబొమ్మలు దగ్ధం చేయాల్సిందిగా హైదరాబాద్ నుంచి మెసేజ్‌లు వచ్చాయని ఆ పార్టీలో ఉన్న తన అనుచరులే చెప్పారని అన్నారు.

రెండు నెలల తరువాత హరి ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్న విషయాన్ని ప్రస్తావించగా, ఆయన తీవ్రంగా స్పందించారు. జగన్‌తో సహా రాజకీయ నాయకులు ఎవరూ ఆకాశం నుంచి ఊడి పడలేదని, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయే కొత్త పార్టీ పెట్టారన్నారు. ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తాను కచ్చితంగా రాజకీయాల్లో కొనసాగుతానన్నారు. పార్టీలు మారడం తప్పు, పాపం, వ్యభిచారం ఏమీ కాదన్నారు. అలా ఎవరైనా అంటే తనకు వర్తించదన్నారు.

వ్యక్తిగత స్వార్థం కోసమో, అధికారంలో ఉండడం కోసమో తాను పార్టీ మారనని చెప్పారు. జగన్‌తో తెగతెంపుల వల్ల ఒక విధంగా మంచే జరిగిందని భావిస్తున్నానన్నారు. మేకపాటి తనపై చేసిన వ్యాఖ్యలు పత్రికల్లో చూశాక ఆయనపై ఎంత ఒత్తిడి తెచ్చారో తెలుస్తోందన్నారు.

తన ఇంటిని ముట్టడించాలనే ఆలోచనను విరమించుకోకపోతే ఊరు వదిలి పోవాల్సి వస్తుందని సబ్బం హరి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అనుచరులను హెచ్చరించిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు కాదన్నంత మాత్రాన తాను ఖాళీగా కూర్చుకోవడానికి రాజకీయ సన్యాసం తీసుకోలేదన్నారు. రెండు నెలల తర్వాత తాను ఎదో ఓ పార్టీలో చేరుతానని ఆయన చెప్పారు. జగన్ పార్టీవాళ్లు ఇంతటితో ఆందోళనలు ఆపితే మంచిదని ఆయన అన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలూ చేయవద్దని తాను అనుచరులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మేకపాటి రాజమోహన్ వ్యాఖ్యలపై సబ్బం హరి తీవ్రంగా ప్రతిస్పందించారు.

English summary

 Congress Anakapally MP Sabbam hari retaliated MP Mekapati Rajamohan Reddy on YSR Congress president YS Jagan issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X