మాది తప్పే, మీరొప్పుకుంటారా: బాబు, జగన్‌కు శైలజా
హైదరాబాద్: విభజన విషయంలో తమ పార్టీది తప్పేనని తాము ఇది వరకే చెప్పామని అలాగే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీలు కూడా తాము తప్పు చేసినట్లుగా ఒప్పుకోగలవా అని మంత్రి సాకె శైలజానాథ్ శుక్రవారం ప్రశ్నించారు. ఆయన సిఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అసెంబ్లీకి తీర్మానం ఎట్టి పరిస్థితుల్లోను రావాల్సిందేనన్నారు. తీర్మానం వస్తే ఓడించాలని అందరం నిర్ణయించుకున్నామని చెప్పారు. తమ పార్టీ నిర్ణయం తప్పని చెప్పాని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు కూడా అంగీకరించగలరా అని ప్రశ్నించారు.

బిల్లు ఏ రూపంలో వచ్చినా తాము వ్యతిరేకిస్తామని, విభజన విషయంలో జగన్ మాట మార్చారని విమర్శించారు. మొదట విభజనకు అనుకూలంగా చెప్పిన జగన్ ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం సమైక్యమంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పటి వరకు సమైక్యం అనడం లేదన్నారు.
ఉద్యోగులు జీతాలు పోగొట్టుకొని ఉద్యమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీక్షలు జగన్ పార్టీకి కొత్త కాదని, చంద్రబాబు కూడా దీక్షలు చేస్తారని చెబుతున్నారని, ఎవర్ని మోసం చేసేందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు.
తీర్మానం వస్తుంది: గంటా
అసెంబ్లీకి తీర్మానం వస్తుందని మరో మంత్రి గంటా శ్రీనివాస రావు వేరుగా అన్నారు. రెండు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. గత సంప్రదాయం ప్రకారం అసెంబ్లీకి తీర్మానం వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications