ఎస్ఈసీపై టీడీపీ ఆరోపణలపై సజ్జల ఫైర్.. చంద్రబాబుకు పక్కవాళ్ళ మీద పడి ఏడవటం అలవాటే అంటూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను, చంద్రబాబు ను కలిపి టార్గెట్ చేసి వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా టిడిపి నేతలు తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా వైసిపి నేతలపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ విఫలమవుతోందని ఎస్ఈసి పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు చేస్తున్న టిడిపి నేతలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

పక్కవాళ్ళ మీద పది ఏడవటం చంద్రబాబుకు అలవాటే
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు . పక్క వాళ్ళ మీద పడి ఏడవడం చంద్రబాబుకు అలవాటేనని పేర్కొన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు అలాగే ప్రవర్తిస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి ఎద్దేవా చేశారు. ఓటమిని కూడా గెలుపు అని చెప్పుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు .

కొత్తగా ఎస్ఈసి ఫై ఆరోపణలు చేస్తున్నారని సజ్జల ఫైర్
ఇంతకుముందు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని హుందాగా అంగీకరించాలని సూచించారు. ఇక ఇప్పుడు సైతం చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్దులే గెలిచారని, వైసిపి సంక్షేమ పథకాలే గెలిపించాయని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు తీరు తీవ్ర ఆక్షేపణీయం అన్నారు. ఇప్పుడు కొత్తగా ఎస్ఈసి ఫై ఆరోపణలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. నిజంగా టిడిపి మద్దతుదారులు గెలిస్తే ఎక్కడ గెలిచారో నిరూపించాలని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

ఎస్ఈసి వైసీపీ అరాచకాలకు తలొగ్గారని టీడీపీ విమర్శలు ..
వైసిపి అరాచకాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తలొగ్గినట్టు ఉందని టిడిపి నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆధారాలతో ఫిర్యాదులు చేస్తున్నా మంత్రులు, నేతలపై నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసిపి నేతలపై ఏం చర్యలు తీసుకున్నారో డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సమాధానం చెప్పాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు పెరిగిపోతున్నాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కట్టడి చేయలేక పోతుందని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను టిడిపి టార్గెట్ చేసిందంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు.












Click it and Unblock the Notifications