ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ - వైసీపీ వైపే వారి చూపు : కేబినెట్ విస్తరణ ఎప్పుడంటే..!!
ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సీఎం జగన్ వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు..తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత ఊతం ఇచ్చాయి. ముఖ్యమంత్రి జగన్ పాలనా పరంగా కీలక స్థానాల్లో ఉన్న అధికారుల స్థాన చలనం చేసారు. మంత్రివర్గ విస్తరణ పైనా సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల కోసం పార్టీని సిద్దం చేసే కార్యాచరణ అమలు చేస్తున్నారు. అటు టీడీపీ అధినేత సైతం ముందుగానే పార్టీ అభ్యర్ధులను ఖరారు చేయాలని డిసైడ్ అయ్యారు. జగన్ ముందస్తు ఎన్నికలు వెళ్లబోతున్నారంటూ చంద్రబాబు సహా టీడీపీ నేతలు పదే పదే చెబుతున్నారు.
Recommended Video

ముందస్తు అవసరం ఏంటి
దీని పైన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. పార్టీ నేతలు ఎవరూ ఆయనకు తాటాకు కూడా దొరకటం లేదని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి వారిని నిలబెట్టుకోవటానికి చంద్రబాబు ఈ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు..నేతలు జగన్ వైపు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రజలను మభ్యపెట్టి.. మోసం చేసేవారికే ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని వ్యాఖ్యానించారు.

పార్టీ - ప్రభుత్వం రెండు కీలకమే
జగన్ నిర్వహిస్తున్న పథకాలు..కార్యక్రమాలకు సమయం సరిపోవటం లేదని..ప్రజలు అయిదేళ్ల పదవి కాలం ఇచ్చారని వివరించారు. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణ పైనా సజ్జల స్పందించారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ రెండున్నరేళ్లకు ఉంటుందని సీఎం జగన్ ముందే చెప్పారని, త్వరలోనే కెబినెట్ రీ-షఫుల్ ఉండే అవకాశం వుందన్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పాలన రెండూ మాకు కీలకమేనని చెప్పుకొచ్చారు. పార్టీ వ్యవస్థాపక వేడకల్లోనూ సజ్జల కీలక వ్యాఖ్యలు చేసారు.

ఆ బాధ్యత కార్యకర్తలదే
ఈ సారి ప్లీనరీ జరుగుతుంది...సభ్యత్వ నమోదు ఉంటుంది. నిజంగా చంద్రబాబు అయితే కోవిడ్ అవకాశంగా పథకాలన్నింటికీ గుండుసున్నా చుట్టేవాడు. ఎంత ఆదాయం తగ్గినా మాట కోసం మన నాయకుడు పడుతున్న కష్టాన్ని మనం గర్వంగా చెప్పుకోవాలి. ఇప్పుడు పెడుతున్న ప్రతి పైసా లబ్దిదారుడికి చేరాలి అనేది మన లక్ష్యం. జగనన్న పథకాల అమలుపై ప్రతిఒక్క కార్యకర్త అందరికీ అందుతున్నాయా లేదా అనేది చూడాలి. అది మీకు పార్టీ మీకు ఇచ్చిన బాధ్యత...అది మీ హక్కు..అంటూ చెప్పుకొచ్చారు.