మూడు రాజధానుల అజెండా వైసీపీని గెలిపించేనా - సజ్జల క్లారిటీ..!!
ఏపీలో మూడు రాజధానుల చుట్టూ ప్రస్తుతం రాజకీయం తిరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ప్రధాన ప్రచారాస్త్రంగా ఉంటుందనే చర్చ మొదలైంది. ఇదే అంశం పైన వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా వైజాగ్ నుండి పరిపాలన ప్రారంభిస్తామని స్పష్టం చేసారు. కోర్టుల్లో ఉన్న అడ్డంకులను అధిగమించి..సాధ్యమైనంత త్వరగా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తామని వెల్లడించారు. అదే సమయంలో మూడు రాజధానులను గెలిపించే ఎజెండా గా తాము చూడటం లేదని సజ్జల స్పష్టం చేసారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పరిపాలన ను వికేంద్రీకరిస్తున్నామని వివరించారు. రహస్యంగా ఉన్న వాళ్ళే బయట కొచ్చారంటూ తాజాగా చంద్రబాబు..పవన్ కళ్యాణ్ సమావేశం పైన వ్యాఖ్యానించారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు బీజేపీ నుంచి వామపక్షాల వరకు జగన్ ను అధికారంలో నుంచి దించేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో లేని నాయకుడు అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతి నిర్మాణం ఆచరణ సాధ్యం కాదని, దీంతోనే సమగ్రాభివృద్ధి కోసం మూడు రాజధానులు అంటున్నామని వివరించారు. గత ఎన్నికల్లో పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ వైపు రాకూడదనే విడివిడిగా పోటీ చేశారని పేర్కొన్నారు.

కేడర్ ను కాపాడుకోవటం కోసమే చంద్రబాబు ముందస్తు ఎన్నికలంటూ ప్రచారం చేస్తున్నారని సజ్జల చెప్పుకొచ్చారు. ప్రజల్లో బలం కోల్పోయిన చంద్రబాబు..ఆ నటుడి తో ఓట్లు వస్తాయనే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేసారు. చంద్రబాబు ఆర్టిఫిషియల్ ఉద్యమం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య విలువలు పెంచామని చెప్పారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాష్ట్రాన్ని అభివృద్ధి భాట లో పెట్టీ తీరుతామని స్పష్టం చేసారు. బండ బూతులు తిట్టే రాజకీయ నాయకులకు వైసీపీ యువత బుద్ది చెప్పాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే వైసీపీకి ఓటు వేయండంటూ సజ్జల స్పష్టం చేసారు. ఎరూ ప్రతిపక్ష పార్టీల ఉచ్చులో పడవద్దని పేర్కొన్నారు.