సొంత పార్టీపై కీలక వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి
గత వైసీపీ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడు పాత్ర ఎంతో ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. జగన్ కన్నా సజ్జల రామకృష్ణారెడ్డినే ఎక్కువగా ఫోకస్ అయ్యారు. సంబంధిత మంత్రుల తరఫున కూడా సజ్జలనే స్పందించారు. దీంతో ఆయన్ను సకల శాఖ మంత్రిగా కూడా పిలిచేవారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ్ సైతం గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు.సజ్జల భార్గవ్ వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలను నిర్వర్తించారు.
గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం వెనుక వీరిద్దరి పాత్ర కూడా ఉందని సొంత పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. జగన్‌ను కలవాలంటే నాడు సజ్జల వ్యవహరించిన తీరు పైన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ని కలిసే అవకాశం ఇవ్వలేదని సజ్జలపై ఆరోపణలు చేశారు. కొంతమంది అయితే సజ్జల వల్లే పార్టీ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు.. సాధారణ జనంతో జగన్ దూరంగా ఉండటం కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఓటమికి కారణమయ్యాయని పలువురు నేతలు తెలిపారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డి సైతం సజ్జల తీరు కారణంగానే పార్టీకి రాజీనామా చేశారనే చర్చ సాగింది.

ఇటువంటి సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి సొంత పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన మాట్లాడుతూ..ఐదు కోట్ల మందిని నేరుగా టచ్ చేసింది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ప్రతి గడపకూ వెళ్ళి సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అన్ని వర్గాలను ముందుకు నడిపించింది వైయస్ జగన్ ప్రభుత్వం. సమాజం అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అనే విధంగా వైయస్ జగన్ పాలన కొనసాగించారు. కలలు కనడం కాదు దానిని ఆచరణలోకి తీసుకురావాలని ఒక్క జగన్ మాత్రమే అసమానతలు ఉన్న సమాజాన్ని ఐదేళ్ళలో దానిని సమాన స్ధాయికి తీసుకొచ్చారు. పేదలు, ఎస్సీలు, మైనార్టీలు వీరిని ఎలా పేదరికం నుంచి బయటికి తీసుకురావాలని ఆలోచించి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని అమలుచేసి నిరూపించిన ఘనత జగన్‌ది. ఒక సంస్కర్తలా అణగారిని వర్గాలను చేయి అందించి పైకి తీసుకొచ్చారు.
మొక్కవోని దీక్ష, నిబద్దత వల్లే ఇది సాధ్యమవుతుంది. అవన్నీ జగన్‌లో మనం చూశాం. మన పార్టీ పేదల పక్షం అని గుండెమీద చెయి వేసుకుని చెప్పగలిగిన ధైర్యాన్నిచ్చారు. అదే కూటమి నాయకులు ఏడాది తిరగక ముందే బయటికి రాలేని పరిస్ధితుల్లో ఉన్నారు. రెడ్ బుక్ పేరుతో అక్రమ కేసులు, వేధింపులకు గురిచేస్తూ పాలన సాగిస్తున్నారు. బరితెగింపు పాలన స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా వైఎస్సార్‌సీపీ నమ్ముకున్న సిద్దాంతానికి కట్టుబడి ఉంది. వైఎస్సార్‌సీపీ డీఎన్‌ఏ పేదల పక్షపాతిగా ఇలాగే ఉంటుంది. జగన్ అన్నట్లు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా బడుగు బలహీన వర్గాలనేది ఈ పార్టీలో ఎప్పటికీ అదే ఉంటుంది. ఉన్నత విద్య, వైద్యం పేదవాడికి అందినప్పుడే నిజమైన అభివృద్ది అని భావించి జగన్ పాలించారు. తమ ప్రభుత్వం చేసిన మంచి పనులే తమను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications