ఆ పరీక్ష పాసైతేనే సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్: సజ్జల క్లారిటీ, చంద్రబాబు, బీజేపీపై ఫైర్
అమరావతి: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్ కావాలంటే డిపార్ట్‌మెంట్ పరీక్ష తప్పక పాస్ కావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కోసం పరీక్ష చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నామని, అందరు ఉద్యోగులకు ఇలాంటి రూల్ ఉందని తెలిపారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎవరి ఉద్యోగాలు పోవంటూ సజ్జల రామకృష్ణారెడ్డి
ఉద్యోగాలు ఎక్కడికీ పోవన,ి పరీక్ష పాస్ కాకుంటే ప్రొబేషన్‌లోనే ఉంటారని సజ్జల వవరించారు. ప్రొబేషన్ నుంచి పర్మినెంట్ అయ్యేందుకు నిబంధనల మేరకు పరీక్ష ఉంటుందని, పరీక్షపాస్ కాకపోతే ప్రొబేషన్ పొడిగిస్తారని తెలిపారు. పరీక్ష పాసైన వెంటనే ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తారని తెలిపారు. సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్‌మెంట్ టెస్టు తప్ప మరో పరీక్ష ఉండదన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఏ ఒక్కరి ఉద్యోగం పోదు, ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఢోకా లేదని సజ్జల స్పష్టం చేశారు.

అమరావతిలో టీడీపీ హయాంలోనే లక్షల కోట్ల అవినీతి..
జాబ్ క్యాలెండర్‌పై మాట్లాడే అర్హత టీడీపీ వాళ్లకు లేదని సజ్జల అన్నారు. రాజధాని అమరావతిలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. టీడీపీ హయాంలో కనీసం కరకట్టనూ విస్తరించలేదన్నారు. కరకట్ట నిర్మిస్తున్నది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డినేనని అన్నారు. రైతులకు కౌలు కూడా పెంచారని చెప్పారు. టీడీపీ హయాంలోనే లక్షల కోట్ల అక్రమాలు జరిగాయని సజ్జల ఆరోపించారు. రూ. వందల కోట్లు దోచుకున్నవారి కలలను సీఎం జగన్ చిన్నాభిన్నం చేశారన్నారు. రాజధాని రైతులను టీడీపీ నేతలే రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

అవి చంద్రబాబు గుంతలంటున్నారు..
రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులన్నీ చంద్రబాబు హయాంలోనివేనని సజ్జల అన్నారు. టీడీపీ హయాంలో పడిన గుంతలను పూడ్చేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. రహదారులపై పడిన గుంతలను చంద్రన్న గుంతలు అని అనాలన్నారు. రోడ్ల నిర్మాణానికి రూ. 2 వేల కోట్లతో ప్రభుత్వం టెండర్లను పిలిచిందన్నారు. రాయలసీమ లిఫ్టుపై టీడీపీ వైఖరేంటని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలోనే తెలంగాణలో ప్రాజెక్టులు కట్టారని అన్నారు.

అప్పులు అందుకే.. బీజేపీ నేతలపై సజ్జల ఫైర్
రుణాంధ్రప్రదేశ్ చేశారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపైనా సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కేంద్రం అడ్డగోలుగా అప్పులు చేయడం లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన అనంతరం రూ. 90వేల కోట్లతో చంద్రబాబు పాలన ప్రారంభమైందన్నారు. చంద్రబాబు దిగిపోయే ముందు తమకు రూ. 2లక్షల 60వేల కోట్ల అప్పు, రూ. 60వేల కోట్ల పెండింగ్ బిల్లులు అప్పగించారని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి చేసేందుకే అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. కరోనా కారణంగా రాస్ట్రంలో సంక్షోభం భయంకరంగా ఉందని, ఆ సంక్షోభం నుంచి బయటపడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎం జగన్ ఇందు కోసం రోజుకు 16 గంటల పనిచేస్తున్నారని సజ్జల చెప్పారు. పోలవరం, రాష్ట్రానికి రావాల్సిన నిధులను బీజేపీ నేతలు రప్పించే ప్రయత్నం చేయాలన్నారు.












Click it and Unblock the Notifications