శ్రీవారి రెండో బ్రహ్మోత్సవ తేదీలు కూడా వెల్లడి- న్యూ బుక్‌లెట్
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఈ సంవత్సరం సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలతో కూడిన బుక్‌లెట్ టీటీడీ పాలకమండలి తాజాగా విడుదల చేసింది. భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళికను ముందుగానే రూపొందించుకునేలా, స్వామివారిని దర్శించుకొనేలా ఈ బుక్ లెట్ ను రూపొందించింది.
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం సందర్భంగా ఛైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, ప్రశాంతి రెడ్డి, కార్యనిర్వాహణాధికారిముద్దాడ రవిచంద్ర, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు ఈ బుక్ లెట్ ను ఆవిష్కరించారు. భక్తులకు మరింత మెరుగైన రీతిలో సేవలందించే దిశగా నూతన బోర్డు తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగంగా ఈ పుస్తకాన్ని విడుదల చేసినట్లు చెప్పారు.

ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమల కొండపై జరగనున్నాయి. ఆ వెంటనే, శరదృతువు పురస్కరించుకుని అక్టోబరు 12వ తేదీ నుంచి అక్టోబరు 20వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈ రెండు మహోత్సవాల వేళల్లో దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని తట్టుకునేలా టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
ఈ నూతన బుక్‌లెట్‌లో శ్రీవారికి తొమ్మిది రోజుల పాటు నిర్వహించే వాహన సేవలు, ప్రత్యేక నైవేద్యాలు, విశేష పూజల సమయాలను స్పష్టంగా పొందుపరిచారు. కీలకమైన గరుడ వాహన సేవ, రథోత్సవం వంటి ప్రధాన ఘట్టాల తేదీలు ఇందులో ఉన్నాయి. ఏ రోజు ఏ వాహనంపై స్వామివారు నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారనే సమాచారాన్ని భక్తులు సులభంగా తెలుసుకోవడం ద్వారా దర్శన టికెట్లను, ప్రయాణాలను ముందే బుక్ చేసుకోవడానికి వీలవుతుంది.
ఉత్సవాల విజయవంతానికి వివిధ ప్రభుత్వ విభాగాలతో సమన్వయం సాధించడమే కాకుండా, తాగునీరు, పారిశుధ్యం, నిరంతర అన్నప్రసాద వితరణ, లడ్డూ ప్రసాదం పంపిణీ వంటి కీలక ప్రాథమిక సదుపాయాలపై బోర్డు సమావేశంలో సుదీర్ఘంగా సమీక్షించారు. భద్రతా ప్రమాణాలపై భక్తులకు ఎక్కడా రాజీ లేకుండా ఏర్పాట్లు చేస్తోన్నారు. దేశ, విదేశాల నుండి భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోన్నారు.













Click it and Unblock the Notifications
