టిడిపిలో సండ్ర అరెస్టు టెన్షన్: తాజా స్థితిపై చంద్రబాబు ఆరా
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో తమ పార్టీ శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య అరెస్టుతో తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కలవరం ప్రారంభమైంది. సమాచారం జపాన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కూడా అందింది. దాంతో ఆయన ఎపికి చెందిన పలువురు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.
సోమవారం సండ్ర అరెస్టయిన వెంటనే పార్టీ నేతలు, మంత్రులు జపాన్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుకు విషయాన్ని చేరవేశారు. అప్పటినుంచి చంద్రబాబు తాజా పరిస్థితులపై ఏపీ పోలీస్ ఉన్నతాధికారులతో ఫోన్, వీడియో కాలింగ్‌లో ఆరా తీసినట్లు తెలిసింది. ప్రతి అర్ధగంటకూ ఏపీ డీజీపీ రాముడును లైన్‌లోకి తీసుకుని ఎలా ముందడుగు వేయాలనే విషయంపై మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇంకా తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు ఎవరెవరికి ఇచ్చే అవకాశాలున్నాయనే విషయంపై కూడా ఆయన ఆరా తీసినట్లు చెబుతున్నారు.
అనురాధ స్థానంలో ఇంటెలిజెన్స్ నూతన చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వరరావుతో కూడా చంద్రబాబు మాట్లాడినట్లు తెలిసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆడియోను పరిశీలించిన ఫోరెన్సిక్ అధికారులు దానికి సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించారు. ఆడియోలోని గొంతు చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ విభాగం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.

అయితే దానిని పక్కాగా నిర్ధారణ చేసుకోవాలంటే, చంద్రబాబు వాయిస్ తీసుకుని, ఆడియోలో ఉన్న వాయిస్‌ను సరిపోల్చాల్సి ఉంటుంది. అప్పుడు చంద్రబాబుకు కూడా నోటీసులు జారీ చేయడానికి ఏసీబీ సిద్ధపడుతుందని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. సండ్ర అరెస్టు నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్టు భవన్, ఏపీ సచివాలయంలో మంత్రులు మీడియాకు అందుబాటులో లేకుండా జాగ్రత్తపడ్డారు.
ఓటుకు నోటు కేసుకు కౌంటర్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుపై పెట్టిన 87 కేసులను దర్యాప్తు చేయడానికి నియమించిన సిట్ బృందం అధిపతి మహ్మద్ ఇక్బాల్‌తో కూడా చంద్రబాబు మాట్లాడినట్లు తెలిసింది. ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి సర్వీస్ ప్రొవైడర్ల నుంచి ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఎలా ముందుకు వెళ్లే విషయంపై తర్జనభర్జనలు పడుతున్నారు.












Click it and Unblock the Notifications