ఇప్పుడు తిప్పండి చక్రం..!!
లోక్ సభ, రాష్ట్ర శాసనసభల్లో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన కృషి చేస్తోంది. ఇందులో భాగంగా, లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 550 నుంచి 850కి పెంచే అవకాశం ఉంది. డీలిమిటేషన్ కమిషన్ తాజా జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు, రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు, వాటి సరిహద్దులను నిర్వచిస్తుంది. దీనికోసం గురువారం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశం కాబోతోంది. 18వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
ఈ మూడు రోజుల పార్లమెంట్ సమావేశానికి ముందు కేంద్ర ప్రభుత్వం చట్టసభ్యులకు పంపిణీ చేసిన బిల్లుల ద్వారా పలు వివరాలు వెల్లడయ్యాయి. వీటిలో డీలిమిటేషన్ బిల్లు, రాజ్యాంగ 131 సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు వంటివి ఉన్నాయి. లోక్‌సభలో రాష్ట్రాల ప్రస్తుత దామాషా ప్రాతినిధ్యాన్ని ఎలా కొనసాగిస్తారనే దానిపై తక్షణ స్పష్టత లేదు. ఏ రాష్ట్రానికి సీట్లు తగ్గవని, ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో సీట్లు నిష్పక్షపాతంగా పునర్విభజన ఉంటుందని కేంద్రం చెబుతోంది.

దీన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తప్పుపట్టారు. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలియట్లేదని,. ప్రతిపాదిత రాజ్యాంగ సవరణకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వట్లేదని అన్నారు. రాష్ట్రానికి హాని కలిగించే లేదా డీలిమిటేషన్‌లో ఉత్తర- దక్షిణాది రాష్ట్రాల మధ్య అసమానంగా జరిగితే భారీ ఆందోళనలు, నిరసనలు ఉంటాయని హెచ్చరించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గబోమనీ తేల్చి చెప్పారు.
2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా అయిదు దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి దామాషా ప్రాతినిధ్యం 20.1 శాతం నుండి 18 శాతానికి తగ్గుతుంది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్, బీహార్ లల్లో 22.1 నుండి 25.1 శాతానికి పెరుగుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుగా భావిస్తున్న నారి శక్తి వందన్ అధినియమ్ లో మార్పులను ప్రతిపాదించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. డీలిమిటేషన్ బిల్లు సాధారణ మెజారిటీతో ఆమోదం పొందే అవకాశం ఉంది.
డీలిమిటేషన్ ప్రక్రియపై శివసేన (ఉద్ధవ్ థాకరే) సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళల రిజర్వేషన్ల ముసుగులో కేంద్ర ప్రభుత్వం దేశ రాజకీయ చిత్రపటాన్ని సమూలంగా మార్చబోతోందని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు చాలా నష్టపోతాయని తేల్చి చెప్పారు. దక్షిణాదిన దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ లోక్ సభ సీట్ల సంఖ్య తగ్గొచ్చని, స్టాలిన్ వంటి నాయకులు ఇప్పటికే దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తోన్న విషయాన్ని గుర్తు చేశారు.
అక్కడి పరిస్థితుల తీవ్రతను బట్టి చూస్తోంటే దక్షిణాదిలో మణిపూర్ లాంటి పరిస్థితి ఏర్పడుతుందేమోనని తాను భయపడుతున్నానని సంజయ్ రౌత్ అన్నారు. దీన్ని అడ్డుకోవాలంటే ఆయా రాష్ట్రాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆత్మగౌరవం ఉంటే, ఎంకే స్టాలిన్ చేస్తున్నట్లే ఈ రకమైన డీలిమిటేషన్‌ను వ్యతిరేకించాలని సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications