సంక్రాంతికి ఇప్పటినుండే ప్రైవేట్ ట్రావెల్ బస్సుల షాక్.. అమాంతం పెంచిన ధరలు!
తెలుగు రాష్ట్రాలలో అప్పుడే సంక్రాంతి సందడి మొదలైంది. నవంబర్ మాసంలోని సంక్రాంతి పండుగకు వెళ్లాలనుకునేవారు టికెట్లను బుక్ చేసుకుంటున్నారు .దీంతో రైల్వే, ఆర్టీసీ బస్సులలో ఆన్లైన్ బుకింగ్ లో టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. సంక్రాంతి పండుగకు రైల్వే అదనపు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తుంది. ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులను ప్రతి సంవత్సరం నడుపుతుంది.
సంక్రాంతి టికెట్ ధరలు పెంచిన ప్రైవేట్ ట్రావెల్స్
ఈ సంవత్సరం ఇప్పటివరకు అదనపు సర్వీసుల విషయంలో అటు రైల్వే, ఇటు ఆర్టీసీ పూర్తిగా ఫోకస్ చేయకపోవడంతో సంక్రాంతికి సొంత ఊరికి వెళ్లాలనుకునే ఏపీ వాసులకు ఇప్పటినుంచే కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు రైళ్లలో, ఆర్టీసీ బస్సులలోను టికెట్లు మొత్తం బుక్ అయిపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు టికెట్ ధరలను అమాంతం పెంచాయి.

ఏపీ వెళ్లేవారికి టికెట్ ధరల బాదుడు
ముఖ్యంగా హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే మార్గాలలోనూ, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి వచ్చే మార్గాలలో ను టిక్కెట్ ధరలు వేల రూపాయలు పలుకుతుంది అంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి ప్రయాణాలు చేసే వారికి టికెట్ల ధరలు మూడువేల రూపాయల నుంచి 5వేల రూపాయలు ధరలు పలుకుతున్నాయి. హైదరాబాద్ నుండి విజయవాడకు నాన్ ఏసీ సీటు ధర 3000 రూపాయలు దాటింది.
టికెట్ లను బుకింగ్ చేసుకుంటున్న ప్రయాణికులు
చెన్నై నుంచి విజయవాడకు ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ ధర 3,500 రూపాయల వరకు ఉందని ప్రయాణికులు లబోదిబో అంటున్నారు. అయితే ఆర్టీసీ, రైల్వే, ప్రత్యేక బస్సులు, ప్రత్యేక రైళ్ల విషయంలో ఇంకా ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో, ఇంకా ఆలస్యం చేస్తే ధరలు మరింత పెరుగుతాయి అన్న భయంతో చాలామంది ప్రయాణికులు ఇప్పుడే టికెట్లను బుక్ చేసుకుంటున్నారు.
ఫ్యామిలీ ఏపీకి వెళ్ళాలంటే ప్రయాణానికే 12000 రూపాయలు
ప్రైవేట్ బస్సులలో అయినా సరే ట్రావెల్ చేయాలని వేల రూపాయలు కేవలం ప్రయాణానికి ఖర్చు చేస్తున్నారు. ఒక ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటే ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల చొప్పున, 12000 రూపాయలు సంక్రాంతికి సొంతూరికి వెళ్లడానికే అవుతుంది. ఇది చాలా మందికి ఆర్థికంగా భారంగా మారుతుంది.
ఈ సంక్రాంతికి బాదుడు బరాబర్
అయితే వచ్చే నెలలో ఏపీఎస్ఆర్టీసీ అదనంగా నడిపే సర్వీసులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అందుకు తగ్గట్టుగా సర్వీసులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని పేద, మధ్యతరగతి వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు ప్రైవేటు ట్రావెల్స్ బాదుడు మామూలుగా ఉండదన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది.












Click it and Unblock the Notifications