ఇకపై తిరుమల వెళ్లాలంటే.. !!
Tirumala: ప్రఖ్యాత పుణక్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీలో మార్పు లేదు. తాకిడి కొనసాగుతోంది. భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. వేలాదిమంది శ్రీవారిని దర్శించుకుంటోన్నారు. గురువారం నాడు 59,548 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,781 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.54 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 30 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 15 నుంచి 17గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో ఉన్న వారికి శ్రీవారి సేవకులు మంచినీరు, పాలు, అల్పాహారాన్ని అందించారు.

కాగా- తిరుమల వాహనాల విషయంలో టీటీడీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కాలం చెల్లిన పెట్రోల్, డీజిల్ వాహనాలను దశలవారీగా తొలగించనుంది. వాటి స్థానంలో విద్యుత్ వాహనాలు వినియోగంలోకి తీసుకుని రానుంది. తిరుమల పవిత్రత, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ దిశగా చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ అదనపు కార్యినిర్వాహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు.
తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి భవనంలో కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ సీనియర్ కన్సల్టెంట్ ప్రతినిధి కునాల్ జోషితో ఆయన సమావేశం అయ్యారు. ఆర్టీసీ అధికారులు కూడా ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడారు. తిరుమలను సంపూర్ణ కాలుష్య రహిత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని తెలిపారు.
ఈ క్రమంలో తిరుపతి- తిరుమల మధ్య పూర్తి స్థాయిలో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. తిరుమలలో నడిచే ట్యాక్సీలు, ఇతర అద్దె వాహనాలను దశలవారీగా ఈవీలతో భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కునాల్ జోషి వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై పూర్తి స్థాయి నివేదికను అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications