అయ్యన్నపాత్రుడుకి వైసీపీ మార్క్ షాక్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు; వదిలేలా లేరుగా !!
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇటీవల కోడెల శివప్రసాద్ రెండవ వర్ధంతి సభలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై, హోం మంత్రి పై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అయ్యన్నపాత్రుడు హోమ్ మంత్రి సుచరిత పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది, దళితుల ఆత్మగౌరవ పోరాట సంఘం ఉపాధ్యక్షుడు వేముల ప్రసాద్ చేసిన ఫిర్యాదు మేరకు అరండల్ పేట పోలీసులు అయ్యన్నపాత్రుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

అయ్యన్నపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
దళిత హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించినందుకు, బహిరంగ సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలని వేముల ప్రసాద్ ఫిర్యాదు చేశారు. హోంమంత్రి పరువుకు భంగం కలిగించేలా మాట్లాడినందుకు సెక్షన్ 505 (2) ప్రకారం మహిళలను కించపరిచేలా మాట్లాడినందుకు సెక్షన్ 509, రాష్ట్ర ముఖ్యమంత్రిని దుర్భాషలాడిన అందుకు సెక్షన్ 294(బి)తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు.

గతంలోనూ నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
అంతకుముందు హోంమంత్రి సుచరితపై చేసిన వ్యాఖ్యలకు నకరికల్లు పోలీస్ స్టేషన్ లోనూ అయ్యన్నపాత్రుడుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే కోడెల వర్ధంతి సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని హోం మంత్రి సుచరితను ఉద్దేశించి అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో కోడెల శివప్రసాద్ రావు హోం మంత్రిగా పని చేశారని నాడు ఎస్పీ నా ..... అంతా ఆయనకు సలాం కొట్టేవారని, ఇప్పటి హోంమంత్రికి మామూలు పోలీస్ అయినా సలాం కొడతాడా అంటూ ప్రశ్నించారు.

హోం మంత్రి, సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదులు
దిశ చట్టం కాకుండానే ఉరిశిక్షలను, యావజ్జీవ శిక్షలు వేయించామని సుచరిత చెబుతున్నారని ఇలాంటి వాళ్లు హోంమంత్రినా అంటూ ప్రశ్నించారు. ఇక సిగ్గు లజ్జ ఉంటే సుచరిత రాజీనామా చేయాలంటూ అయ్యన్నపాత్రుడు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మటన్ మార్ట్ లు, ఫిష్ మార్ట్ లు కాకుండా అంబటి అధ్యక్షతన మల్లె పూల వ్యాపారం చేస్తే బాగుంటుంది అంటూ అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు. కోడెల వర్ధంతి సభలో నోటికొచ్చినట్టు జగన్ ను, హోమ్ మంత్రి సుచరితను తిట్టిపోశారు అయ్యన్నపాత్రుడు. ఇక ఆ వ్యాఖ్యలపై ఇప్పటికీ ఏపీలో వైసీపీ నేతలు మండిపడుతూనే ఉన్నారు. వివిధ పోలీసు స్టేషన్లలో అయ్యన్నపాత్రుడుపై వరుసగా ఫిర్యాదు చేస్తున్నారు.

కేసులు పెట్టినా, జైలుకు పంపినా సరే జగన్ పై పోరు ఆపేది లేదన్న అయ్యన్న
అయినప్పటికీ అయ్యన్న పాత్రుడు మాత్రం తనదైన శైలిలో జగన్ పై, జగన్ పాలనపై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపటం తమ విధి అని చెప్తున్నారు. జగన్ తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలపైనే తాను విమర్శలు చేశానని అంటున్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు పంపినా సరే తాను జగన్ ప్రభుత్వాన్ని వదిలేది లేదని చెప్తున్నారు. ఎవరికీ భయపడేది లేదని అయ్యన్న తేల్చి చెప్తున్నారు.












Click it and Unblock the Notifications