మోడీ టూర్ లో భద్రతా వైఫల్యం-హెలికాఫ్టర్ పైకి నల్ల బెలూన్లు వదిలిన కాంగ్రెస్-పోలీసుల విచారణ
ప్రధాని మోడీ భీమవరం టూర్ లో భద్రతా వైఫల్యాలు బయటపడ్డాయి. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు పెద అమిరంలో బహిరంగ సభలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఏపీకి వచ్చారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆయన.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో సీఎం జగన్, గవర్నర్ హరిచందన్ తో కలిసి భీమవరం వెళ్లారు.
అయితే గన్నవరం ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ వచ్చి అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో భీమవరానికి బయలుదేరగానే అక్కడ కాంగ్రెస్ నేతలు నల్లబెలూన్లు వదిలారు. మోడీ భీమవరం రాకను నిరసిస్తూ వారు ఈ బెలూన్లు వదిలినట్లు తెలుస్తోంది. గన్నవరం మహిళా కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ ఆధ్వరంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చిన గన్నవరం ఎయిర్ పోర్టులో నిరసనలు తెలపాలని భావించినా పోలీసు బందోబస్తుతో అది సాధ్యం కాలేదు. దీంతో ఆటోలో గన్నవరం ఎయిర్ పోర్టు వద్దకు వచ్చిన పద్మశ్రీని గుర్తించిన పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.

అయితే కాంగ్రెస్ నేతలు వదిలిన నల్ల బెలూన్లు హెలికాఫ్టర్ ను తాకకపోయినా చుట్టూ మాత్రం ఎగిరినట్లు కనిపిస్తోంది. దీన్ని ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ గ్రూప్ స్ధానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నల్ల బెలూన్లు ఎగరేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రధాని పర్యటనలో చోటు చేసుకున్న ఈ భద్రతా వైఫల్యాన్ని ఎస్పీజీ కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఈ వ్యవహారంపై కలకలం రేగుతోంది.












Click it and Unblock the Notifications