టెర్రరిస్టుల లెక్కనే సీమాంధ్ర నేతలు: హరీష్ రావు ఫైర్
హైదరాబాద్: సీమాంధ్ర నాయకులపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతున్న సీమాంధ్ర నాయకులపై దేశద్రోహం కింద కేసులు నమోదు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
టెర్రరిస్టులకు, సీమాంధ్ర నాయకులకు మధ్య కొంచెం కూడా తేడా లేదని ఆయన అన్నారు. తెలంగాణ నాయకులపై డిజిపి బి. ప్రసాద రావు అనుసరిస్తున్న వైఖరిపై కూడా హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్ర విభజన విషయంలో తెలంగాణ నాయకులపై డిజిపి కింద కేసులు బనాయిస్తున్నారని ఆయన అన్నారు.

అయితే సీమాంధ్ర వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ఆయన డిజిపిని ప్రశ్నించారు. పార్లమెంటును తగులబెడుతామని సీమాంధ్ర నాయకులు అంటుంటే డిజిపి ఏం చేస్తున్నారని ఆయన అడిగారు. సీమాంధ్ర తెలుగుదేశం శాసనసభ్యుడు లింగారెడ్డిపై ఎందుకు సుమోటోగా కేసు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రపతి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు చేతులు కట్టుకుని లేరని, జరగరానిది జరిగితే ఏం జరుగుతుందో ఊహించుకోవాలని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతలు పార్లమెంటును తగలబెడితే తెలంగాణ ప్రజలు ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌ను తగులబెడుతారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications