తెలంగాణను అడ్డుకోలేరు: విహెచ్, ఆంక్షలొద్దు: పోచారం
హైదరాబాద్: సీమాంధ్ర నాయకులు ఎన్ని ఎత్తులు వేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని అన్ని పార్లమెంటు స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం కాదని, తన కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకేనని హనుమంతరావు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. తెలంగాణలో రథయాత్ర నిర్వహించి ప్రజలను చైతన్య పరుస్తామని హనుమంతరావు తెలిపారు.

హైదరాబాద్‌పై ఆంక్షలోద్దు: పోచారం
హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలకు ఒప్పుకోమని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పది జిల్లాల తెలంగాణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల నేతలు శ్రీనివాస రెడ్డి, ఏనుగు రవీంద్ర రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పోరాటాలతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతోందని వారు స్పష్టం చేశారు.
తెలంగాణ బిల్లును శీతాకాల సమావేశాల్లోనే ఆమోదింపజేయాలని టిఎన్‌జిఓ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ అన్నారు.హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని ఆయన శనివారం మాట్లాడుతూ.. గవర్నర్ పాలన పరిధిలోకి జిహెచ్ఎంసిని తీసుకురావడం అన్యాయమని అన్నారు. స్థానికత ఆధారంగానే పెన్షనర్ల విభజన చేయాలని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications