సీమాంధ్ర మంత్రులకు పిలుపు: యుటితో తగాదే.. విహెచ్
న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులకు కేంద్రమంత్రి, మంత్రుల బృందం (జివోఎం) సభ్యులు జైరాం రమేశ్ నుండి మంగళవారం పిలుపు వచ్చింది. బుధవారం ఉదయం పది గంటలకు కృషి భవనంలో జైరాం వారితో భేటీ కానున్నారు. ఆయన రాష్ట్ర విభజన, హైదరాబాదు అంశాల పైన చర్చించే అవకాశాలున్నాయి.
షిండేతో టి నేతల భేటీ
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు మంగళవారం ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి, మంత్రుల బృందం (జివోఎం) సభ్యులు సుశీల్ కుమార్ షిండేను కలిశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో శాసన సభ స్థానాలను 119 నుండి 153కు పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు.

అలాగే విభజన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, వచ్చే శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని, ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలని, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయవద్దని వారు కోరినట్లుగా తెలుస్తోంది.
షిండేతో భేటీ అనంతరం రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు మాట్లాడారు. హైదరాబాదును యుటి చేస్తే ఒప్పుకునేది లేదని షిండేకు చెప్పామని, గతంలో సోనియా, ఢిల్లీ పెద్దలకు ఇదే చెప్పామన్నారు. హైదరాబాదును యుటి చేస్తే భవిష్యత్తులో తగాదాలు తప్పవన్నారు.
ప్రధానిని కలిసిన బిజెపి నేతలు
మరోవైపు వరుసగా తుఫాన్లతో నష్టపోయిన రాష్ట్ర రైతులను ఆదుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను బిజెపి నేతలు కలిశారు. పార్టీ సీనియర్ నేతలు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డిలు ప్రధానిని కలిశారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను, మత్స్యకారులను ఆదుకోవాలని తాము ప్రధానిని కోరామని వెంకయ్య నాయుడు చెప్పారు. లెహర్ తుఫానుతో పొంచి ఉన్న ముప్పును తెలియజేశామన్నారు. ఒడిశా, ఎపిలకు వెయ్యి కోట్ల రూపాయల సహాయం ఇవ్వాలని కోరామని, కేబిల్ వ్యవస్థ లేకుండా విద్యుత్ ఏర్పాటు చేయాలని కోరగా కేంద్ర హోంశాఖ అంగీకరించిందన్నారు.












Click it and Unblock the Notifications