విభజన: మంత్రులకు ప్రధాని, కన్నాకు సోనియా హామీ
న్యూఢిల్లీ: తనను కలిసిన సీమాంధ్ర కేంద్రమంత్రులకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. విభజన తర్వాత సీమాంధ్రకు ఎలాంటి ఢోకా ఉండదని, అందుకు తన హామీ ఆని ప్రధాని చెప్పారు. కేంద్రమంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి, కావూరి సాంబశివ రావు, పళ్లం రాజులు ప్రధానిని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన వారికి హామీ ఇచ్చారు. ప్రజల ఆందోళనలు అన్నింటిని పరిష్కరిస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమన్యాయం జరుగుతుందని, ఆ ప్రాంత ప్రజల ఆందోళనలన్నింటినీ పరిష్కరిస్తామని మన్మోహన్ తెలిపారు. అందరికీ న్యాయం చేస్తామని, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారంతో ముందుకు వస్తామన్నారు.

అనంతరం చిరంజీవి, పురందేశ్వరి, జెడి శీలం సోమవారం సాయంత్రం ఆరున్నరకు జివోఎం సభ్యుడు, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీని కలిశారు. కొద్దిసేపటికి కావూరి సాంబశివ రావు, కిల్లి కృపారాణి కూడా ఆంటోనీ నివాసానికి వచ్చి ఆయనతో భేటీ అయ్యారు.
అన్యాయం జరగనివ్వం: కన్నాకు సోనియా
రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ముఖ్యమంత్రి పదవికి పోటీలో ఉన్నారనే ప్రచారంలో ఉన్న మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సోమవారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ఆయన వివరించారని తెలుస్తోంది. సీమాంధ్ర ప్రజల మనోభావాలను ఆయన వివరించగా, ఎలాంటి అన్యాయం జరగనివ్వమని సోనియా ఆయనకు స్పష్టం చేశారు. సీమాంధ్ర నష్ట పోకుండా ఏం చర్యలు తీసుకోవాలో కన్నా వివరించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications