వేగంగా వస్తున్న రైలుతో సెల్ఫీ: ఎగిరిపడటంతో తీవ్రగాయాలు
విజయవాడ: ప్రమాదకర సెల్ఫీలు దిగుతూ చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నా.. యువతలో ఎలాంటి మార్పూ రాకపోవడం విచారకరం. తాజాగా విజయవాడలో ఓ యువకుడు రైలుతో ప్రమాదకరంగా సెల్ఫీ దిగుతూ.. ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు.
వరదరాజులు(15).. వేగంగా దూసుకొస్తున్న రైలు పక్కన నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని తీవ్రంగా గాయపడ్డాడు. రైలును స్పష్టంగా సెల్‌ఫోన్‌లో తనతో కలిపి బంధించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం.. మధురానగర్ పప్పులమిల్లు రైల్వేగేటు వద్ద సోమవారం సాయంత్రం మచిలీపట్నం ప్యాసింజర్ వస్తుండడంతో గేటు పడింది. సరిగ్గా అదే సమయంలో మాచవరానికి చెందిన పదో తరగతి విద్యార్థి వరదరాజులు అక్కడికి వచ్చాడు.

ట్రాక్ పక్కన నిలబడి వెనుకనుంచి రైలు వస్తుండగా.. చేతితో ఫోన్ పట్టుకుని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఫొటో రైలు మరింత బాగా రావాలనే ఉత్సాహంలో.. కొంచెం పక్కకు జరిగాడు. అయితే.. అనుకోకుండా రైలుకు అతి సమీపంలోకి వెళ్లిపోయాడు. ఒక్కసారిగా వచ్చిన రైలు ఇంజిన్ వెడల్పుగా ఉండటంతో అతని చేతికి తగిలింది. దీంతో.. ఎగిరి దూరంగా పడిపోయాడు.
ఈ ప్రమాదంలో వరదరాజులుకు కాలు విరగడంతో పాటూ ముఖం, ఒంటిపై తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అక్కడున్నవారు వెంటనే స్పందించి క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవరు రైలును కొద్దిసేపు ఆపివేశారు.












Click it and Unblock the Notifications