Semister System : ఏపీ స్కూళ్లలో సెమిస్టర్ విధానం- కాలేజీల తరహాలోనే- పూర్తి వివరాలివే..!
ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కొత్త రూపాల్లో విద్యాసంస్కరణలు చేపడుతున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీల తరహాలోనే స్కూళ్లలోనూ ఇకపై సెమిస్టర్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఏయే క్లాసులకు ఎప్పటి నుంచి, ఎలా ఈ విధానం అమలు చేయాలన్న దానిపై అధికారులకు క్లారిటీ ఇచ్చింది.

ఏపీలో విద్యాసంస్కరణలు
ఏపీలో పాఠశాల విద్యావిధానంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు జాతీయ విద్యావిధానం అమలు చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు మిగతా రాష్టాల్లో ఎక్కడా లేని విధంగా విన్నూత్న సంస్కరణలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. వీటిపై అక్కడక్కడా విమర్శలు వస్తున్నా ఓవరాల్ గా చూసుకుంటే మంచి స్పందనే వస్తోంది.
ముఖ్యంగా ఉపాధ్యాయల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలను సైతం పరిగణనలోకి తీసుకుంటూ వారిని సంస్కరణల దిశగా నడిపిస్తున్న వైసీపీ సర్కార్.. ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

స్కూళ్లలోనూ సెమిస్టర్ విధానం
ఏపీలో ఇప్పటివరకూ యూజీ, పీజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానం అమలవుతుండగా.. ఇప్పుడు స్కూళ్లలోనూ సెమిస్టర్ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే దీనిపై విధాన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో సెమిస్టర్ విధానం అమల్లోకి రాబోతోంది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఎవరెవరికి వర్తిస్తుందనే దానిపై ఇవాళ జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దీంతో అధికారులు ఈ ఉత్తర్వులు అమలు చేసేందుకు సిద్దమవుతున్నారు.

వచ్చే విద్యాసంవత్సరం నుంచే
ప్రస్తుతం 2022-23 విద్యాసంవత్సరం కొనసాగుతోంది. దీంతో ఈ ఏడాది మధ్యలో సెమిస్టర్ విధానం అమలు చేసేందుకు వీలు కాదు. దీంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి అంటే 2023-24 విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అయితే ఇందులో 1 నుంచి 9 తరగతుల వరకూ మాత్రమే వచ్చే విద్యాసంవత్సరం నుంచి సెమిస్టర్ విధానం అమలు చేయబోతున్నారు. పదో తరగతి విద్యార్ధులకు మాత్రం 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

సెమిస్టర్లతో సంబంధం లేకుండా విద్యాకానుక?
రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి సెమిస్టర్ విధానం అమల్లోకి తీసుకురాబోతున్న ప్రభుత్వం.. విద్యాకానుక విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 9వ తరగతి వరకూ ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్న సెమిస్టర్ విధానంలో భాగంగా రెండు సెమిస్టర్లు ఉంటాయి.
అయితే ఇప్పుడు ఇస్తున్నట్లుగానే సెమిస్టర్ విధానంలోనూ విద్యాకానుకలో భాగంగా పుస్తకాలు విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఇవ్వాలని నిర్ణయించారు. అంటే రెండు సెమిస్టర్లకు సంబంధించిన పుస్తకాలు వేర్వేలుగా ముద్రించినా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్ధులకు అందిస్తారు. దీంతో విద్యార్ధులకు ఆ తర్వాత పుస్తకాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.












Click it and Unblock the Notifications