పోస్టింగ్ కోసం ఏబీ ఎదురుచూపులు-సీఎస్ కు మరో లేఖ-హైకోర్టు, సుప్రీం తీర్పుల అమలుకు..
ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు వైసీపీ ప్రభుత్వంలో చుక్కలు కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అదికారంలోకి రాగానే ఏబీని నిఘా పరికరాల కొనుగోలు కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారు. అది కాస్తా విఫలం కావడంతో హైకోర్టు, సుప్రీంకోర్టులు ఆయనపై విధించిన సస్పెన్షన్ ఎత్తేసి పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించాయి. అయినా జగన్ సర్కార్ మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు.

పోస్టింగ్ కోసం ఏబీ ఎదురుచూపులు
నిఘా పరికరాల అక్రమ కొనుగోళ్ల వ్యవహారంలో గతంలో ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ పై సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది. ఏబీపై సస్పెన్షన్ ఎత్తేసి ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని స్వయంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా వైసీపీ ప్రభుత్వం మాత్రం సస్పెన్షన్ మాత్రం ఎత్తేసి పోస్టింగ్ ఇవ్వడం లేదు. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు పరిస్ధితి అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయింది. గతంలో సస్పెన్షన్ ఎప్పుడు విధించారో అప్పటి నుంచో ఎత్తేయాలని ఏబీ కోరుతుండగా.. ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాత్రమే సస్పెన్షన్ ఎత్తివేతను అమల్లోకి తెచ్చింది. దీనిపై ఏబీ పోరాటం కొనసాగుతోంది.

సర్కార్ కు లేఖల పరంపర
తనపై సస్పెన్షన్ విధించిన తేదీ నుంచి దాన్ని ఎత్తేయాలని ఏబీ కోరుతున్నా ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే సస్పెన్షన్ ఎత్తివేత అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై ఏభీ వరుసగా సీఎస్ సమీర్ శర్మకు లేఖలు రాస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. కనీసం తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో తాజాగా ఏబీ సీఎస్ సమీర్ శర్మకు మరో లేఖ రాశారు. తన సస్పెన్షన్ విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయడం లేదంటూ ఏబీవీ లేఖలో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం తన సస్పెన్షన్ ఎత్తివేత అమలు చేయాలని, అప్పటి నుంచి జీత భత్యాల బకాయిలు కూడా చెల్లించాలని ఏబీ కోరారు.

మళ్లీ కోర్టుకెక్కాల్సిందేనా ?
ఏబీ సస్పెన్షన్ పై వైసీపీ సర్కార్ మొండివైఖరి ప్రదర్శిస్తుండటంతో ఏబీ తిరిగి హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తన పోస్టింగ్ కోసం నాలుగైదు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏబీవీ తిరిగి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే కోర్టు ధిక్కారం కింద ఆయన పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు కేసుల్లో కోర్టు ధిక్కారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ సర్కార్ కు ఇది మరో ధిక్కారం కానుంది. మరి ప్రభుత్వం అందుకు సిద్దపడుతుందా లేక ఏబీకి నిబంధనల ప్రకారం పోస్టింగ్ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications