పట్టు కోల్పోయిన పవన్: వైసీపీలో మరో జనసేన సీనియర్
TDP Janasena BJP alliance: ఈ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీ.. జనసేన, భారతీయ జనతా పార్టీతో కట్టిన కూటమి ప్రభావం సీనియర్లకు టికెట్లు లేకుండా చేస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల సీట్లు, టికెట్లను కోల్పోవాల్సి వస్తోంది.
ఈ క్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు గుడ్‌బై చెప్పారు. రాజీనామాలు చేశారు. ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్సీపీలో చేరారు. పితాని బాలకృష్ణ, పోతిన మహేష్, శెట్టిబత్తుల రాజాబాబు, బుసనబోయిన వెంకటేశ్వరరావు అలియాస్ బీవీ రావు, పోలసపల్లి సరోజ, పంతం ఇందిర.. వంటి పలువురు సీనియర్ నాయకులు ఇదివరకే జనసేన నుంచి బయటికి వచ్చారు. ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

తాజాగా- అమలాపురానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు డీఎంఆర్ శేఖర్.. వైఎస్ఆర్సీపీలో చేరారు. అనకాపల్లి జిల్లా గొడిచర్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆయన వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా కండువాను కప్పి ఆయనను స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్.
అమలాపురం లోక్‌సభ నియోజకవర్గంపై డీఎంఆర్ శేఖర్‌కు గట్టిపట్టు ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు డీఎంఆర్ శేఖర్. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. మూడోస్థానంలో నిలిచారు. 2 లక్షల 54 వేలకు పైగా ఓట్లు పోల్ అయ్యాయి ఆయనకు.
ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి అమలాపురం లోక్‌సభ స్థానాన్ని వదలుకుంది జనసేన. ఇక్కడి నుంచి తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా గంటి హరీష్ మాథుర్ బరిలో నిలిచారు. హరీష్ మాథుర్ గెలుపు కోసం పని చేయాల్సిన పరిస్థితి రావడంతో జనసేన నుంచి బయటికి వచ్చారు డీఎంఆర్ శేఖర్.
అమలాపురం లోక్‌సభ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న రాపాక వరప్రసాద్ గెలుపు కోసం తాను కృషి చేస్తానని డీఎంఆర్ శేఖర్ ప్రకటించారు. జిల్లాలో జనసేనను బలోపేతం చేయడానికి తాను ఎంతో శ్రమించానని, ఆర్థికంగా నష్టపోయానని పేర్కొన్నారు. తనకు టికెట్ ఇవ్వకుండా టీడీపీకి కేటాయించడం సబబు కాదని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications